
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : పాదయాత్ర చేస్తూనే ఎదురొచ్చిన ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ మంత్రి కేటీఆర్ ముందుకు సాగారు. రాంరెడ్డి అనే రైతు కేటీఆర్‌కు వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేయగా దాన్ని తీసుకుని ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఎన్జీ కాలేజీ ముందుకు రాగానే అక్కడ నిలబడి ఉన్న ముగ్గురు యువకులను కేటీఆర్ పలుకరించారు. నల్లగొండ ఎట్లుందని వారిని ప్రశ్నించగా రోడ్లు బాగుచేయాలి, పార్కులు పెట్టాలని చెప్పారు. వారు సెల్ఫీ అడుగడంతో వారితో సెల్ఫీ దిగారు. తర్వాత పక్కనే ఉన్న జగన్ బుక్స్టాల్లోకి వెళ్లి షాపు ఎలా నడుస్తుందని ఆరా తీశారు. నల్లగొండకు ఏం ఇస్తే బాగుంటదని, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బాగా పనిచేస్తున్నాడా అని ప్రశ్నించారు కేటీఆర్. ఎమ్మెల్యే బానే పనిచేస్తున్నాడు సార్, రోడ్లు, డ్రైనేజీ సమస్యనే పెద్దగా ఉన్నదని షాపు యజమాని చెప్పగా త్వరలోనే బాగుచేస్తామని చెప్పి అక్కడి నుంచి కదిలారు. తర్వాత ఎస్పీ కార్యాలయం దాటాక షాపింగ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లారు. అక్కడ సంధ్య మెన్స్ సెలూన్, రెడ్డి హోటల్, శ్రీవెంకటేశ్వర జిరాక్స్ అండ్ మీ సేవ, గీతా ఫొటో స్టూడియోల్లోకి కూడా మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డితో కలిసి వెళ్లి బాగోగులపై కుశల ప్రశ్నలు వేశారు. వారంతా ప్రభుత్వ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పట్టణంలోని సమస్యలను గుర్తు చేశారు. త్వరలోనే నల్లగొండను అభివృద్ధిలో పూర్తిగా మార్చేస్తామని, రోడ్లు, డ్రైనేజీ, మార్కెట్లు, పార్కులు, ట్యాంకుబండ్, ఐటీ హబ్ అన్నీ పూర్తి చేసేందుకే సీఎం కేసీఆర్ మమ్మల్ని పంపించారని వివరించారు. తర్వాత ఇద్దరు చంటి పిల్లలను ఎత్తుకుని భిక్షాటన చేస్తున్న మహిళలను పలుకరిస్తూ వారి వివరాలను సేకరించారు. పక్కనే ఉన్న కలెక్టర్‌కు వారి వివరాలు తీసుకుని నివాస స్థలాలు, ఇతర సౌకర్యాలు కల్పించేలా చూడాలని ఆదేశించారు. మధ్యలో కొందరు యువకులు ఏదో సమస్యపై వినతిపత్రం ఇవ్వబోగా అన్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందంటూ వారి కోరిక మేరకు సెల్ఫీ దిగారు. ఓ వైపు అభివృద్ధి పనులను పరిశీలిస్తూనే.. మరోవైపు పట్టణ పౌరులను పలకరిస్తూ.. ఫొటోలకు అవకాశం కల్పిస్తూ కేటీఆర్ తనదైన శైలిలో ముందుకు సాగడంపై నల్లగొండ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సామాన్యుడిలా..
మంత్రి కేటీఆర్ చాలా సింపుల్‌గా సరదాగా పట్టణ ప్రజలను పలుకరిస్తూ పాదయాత్ర చేయడం పట్ల నల్లగొండ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కేటీఆర్ పలుకరించిన ప్రతి ఒక్కరూ ఇంత సింపుల్‌గా.. ఓపికగా.. స్పష్టంగా మాట్లాడుతాడా అంటూ చర్చింకుంటున్నారు. టీవీల్లో, మీటింగుల్లో చూసినప్పుడు గంభీరంగా కనిపించే కేటీఆర్‌కు మాతో మాట్లాడిన కేటీఆర్‌కు అస్సలు పోలికే లేదంటున్నారు. ఏ మాత్రం కలవర పెట్టకుండా.. ఒక్కో అంశంపై చక్కగా ఆరా తీశారని సంధ్య మెన్స్ పార్లర్ ఓనర్ మునుగోటి నారాయణ అన్నారు. మా బాగోగులు అడుగుతూ నల్లగొండకు ఏం కావాలని ప్రశ్నిస్తూ తాను ఆఫర్ చేయగానే టీ తాగారని రెడ్డి హోటల్ యజమాని మహ్మద్ సల్మాన్ చెప్పారు. పాన్‌షాపు నిర్వాహకుడు సద్దాం హుస్సేన్ స్పందిస్తూ తాను కట్టి ఇచ్చిన పాన్‌ను కేటీఆర్‌తోపాటు జగదీశ్‌రెడ్డి కూడా తినడం జీవితంలో మర్చిపోలేనిదని ఆనందం వ్యక్తం చేశారు. ఇలా కేటీఆర్‌ను కలిసిన ప్రతిఒక్కరూ ఆయన స్వభావం, వ్యవహారశైలి గొప్పగా ఉందని వర్ణిస్తుండడం కనిపించింది.
స్థలం : రెడ్డి హోటల్..
కేటీఆర్ : నీ పేరు తమ్ముడు?
యువకుడు : మహ్మద్ సల్మాన్ సార్
కేటీఆర్ : ఎప్పటి నుంచి హోటల్ నడుపుతున్నారు?
యువకుడు : 25 సంవత్సరాలు సార్
కేటీఆర్ : కరెంటు సమస్య ఉందా మీకు?
యువకుడు : లేదు సార్.
కేటీఆర్ : వాటర్ సమస్య ఉందా?
యువకుడు : లేదు సార్.
కేటీఆర్ : షాదీముబారక్ వస్తుందా?
యువకుడు : వస్తుంది సార్.. కానీ లేట్ అవుతుంది
కేటీఆర్ : నల్లగొండలో సమస్యలు ఏమున్నాయ్?
యువకుడు : రోడ్లు పెద్దగా చెయ్యాలి. ఉన్న రోడ్లను నీట్‌గా ఉంచాలి. మైనార్టీలకు లోన్లు ఇవ్వాలి. ఉద్యోగాలు కూడా ఇవ్వాలి సార్. నీళ్లు, కరెంటు సమస్యలు ఏమీ లేవు సార్.
కేటీఆర్ : నువ్వు చెప్పినవన్నీ త్వరలోనే చేసేందుకే మేము వచ్చాం. అన్నీ పూర్తి చేస్తాం.
కేటీఆర్ : టీ పోస్తావా మాకందరికీ?
యువకుడు : సార్ కూర్చోండి అంటూ కుర్చీలు వేయగా కేటీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, అధికారులు కూర్చుని టీ తాగారు.
కేటీఆర్ : ఐదు టీలు తాగాం కదా అంటూ 500రూపాయలు చేతిలో పెట్టి బయటకు వచ్చారు.
అది నల్లగొండ పట్టణంలోని సంధ్య మెన్స్ పార్లర్…
మంత్రి కేటీఆర్ : నీ పేరేంటి?
యజమాని : మునుగోటి నారాయణ
కేటీఆర్ : నేనెవరిని
యజమాని : కేటీఆర్వు సారూ
కేటీఆర్ : నా పక్కన ఉన్నది ఎవరు (మరో మంత్రిని చూపిస్తూ)
యజమాని : మా మంత్రి జగదీశ్‌రెడ్డి సారు
కేటీఆర్ : ఎన్ని ఏండ్ల నుంచి షాపు నడుపుతున్నావ్?
యజమాని : 22 సంవత్సరాలు
కేటీఆర్ : అప్పటి నుంచి రోడ్లు ఇట్లనే ఉన్నాయా?
యజమాని : ఇట్లనే ఉన్నాయి సార్. ఏం మారలేదు.
కేటీఆర్ : కరెంటు ఎట్లా వస్తుంది? సెలూన్‌కు ఫ్రీ కరెంటు ఇస్తున్నారా?
యజమాని : కరెంటుతో ఇబ్బందులు లేవు. కేసీఆర్‌తోనే ఫ్రీ కరెంటు అందుతుందంటూ (కేటీఆర్ కాళ్లు మొక్కబోయాడు)
కేటీఆర్ : వద్దని వారిస్తూ నల్లగొండ మార్పు జరుగాలంటే ఏం ఇస్తే బాగుంటది?
యజమాని : విశాలమైన రోడ్లు కావాలి. రోడ్లు బాగుచేయాలి. హైదరాబాద్ అంతకాకున్నా ఆ రీతిలో బాగుచేయాలి.
కేటీఆర్ : తొందరలోనే అన్ని పనులు చేస్తాం. కేసీఆర్ చెప్పిండు. నల్లగొండను మార్చడమే మాపని.