పుష్కలంగా సాగునీరు.. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా.. సమయానికి పెట్టుబడి సహాయం అందుతుండడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రైతుబంధు వారోత్సవాల సందర్భంగా గురువారం సైతం సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. రైతు వేదికలను అందంగా అలంకరించారు. కేకులు కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ‘రైతుబంధు’ అక్షరాల రూపంలో కూర్చొని పథకం గొప్పతనాన్ని చాటి చెప్పారు. వ్యవసాయ క్షేత్రాల్లో కృతజ్ఞతాపూర్వకంగా రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలను ప్రదర్శించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతుబంధు సంబురాలు నాల్గో రోజైన గురువారం అంబరాన్నంటాయి. ఊరూవాడా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. సిరికొండ మండల కేంద్రంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రైతు వేదికల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి కేకులు కట్ చేశారు. వ్యవసాయ క్షేత్రాల్లో కృతజ్ఞతాపూర్వకంగా రైతులు సీఎం కేసీఆర్ ప్లకార్డులు ప్రదర్శించి హర్షం వ్యక్తం చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ‘రైతుబంధు’అక్షరాల రూపంలో కూర్చొని పథకం గొప్పతనాన్ని చాటి చెప్పారు.
కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటా ఆనందం..ట్విట్టర్లో ఎమ్మెల్సీ కవిత
సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన బాగాజి పోశెట్టికి ఉన్న అర ఎకరం వ్యవసాయ భూమికి ప్రభుత్వం రైతు బంధుపథకం ద్వారా రూ.2500 పెట్టుబడి డబ్బులను ఆయన ఖాతాలో జమ చేయడంతో పాటు ప్రతినెలా రూ.2016 పింఛన్ డబ్బులు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రభుత్వ పథకాలు, ఫలాలు ప్రలందరికీ చేరవేస్తున్న సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉందని.. ఆనందం వెల్లివిరుస్తున్నదని పేర్కొన్నారు.