జక్రాన్‌పల్లి, డిసెంబర్ 15 : దుబాయిలో టీబీ బారిన పడి చికిత్స పొందుతున్న బాధితుడు చెమ్మటి సాయికుమార్.. ఎమ్మెల్సీ కవిత చొరవతో స్వగ్రామం సికింద్రాపూర్‌కు చేరుకున్నాడు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామానికిచెందిన చెమ్మటి సాయికుమార్ ఉపాధి కోసం నాలుగేండ్ల క్రితం దుబాయికి వెళ్లాడు. రెండు నెలల క్రితం ఆయనకు టీబీ సోకగా అక్కడి దవాఖానలో చేరాడు. దేశం కాని దేశంలో అయిన వారు ఎవరూ లేకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఆరోగ్యం మరింత క్షీణించిపోయింది. దీంతో సాయికుమార్ మిత్రులు విషయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. మండల వైస్ ఎంపీపీ కుంచాల విమలారాజు, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, సర్పంచ్ గంగామణి గంగాధర్, ఉపసర్పంచ్ సంతోష్, గ్రామ కమిటీ సభ్యులు లక్ష్మీనర్సయ్య, పెద్ద రాజన్న తదితరులు ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు పరిస్థితి వివరించారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్సీ కవిత దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.
15 రోజుల క్రితం నిజామాబాద్‌కు వచ్చిన ఎమ్మెల్సీ కవితను సైతం సాయికుమార్ కుటుంబ సభ్యులు కలిసి పరిస్థితిని వివరించారు. ఎమ్మెల్సీ కవిత సొంత ఖర్చులతో సాయికుమార్‌ను స్వగ్రామానికి రప్పించడమే కాకుండా ఆయన పని చేసిన కంపెనీ నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్‌ను ఇప్పించారు. సాయికుమార్ విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీసుకున్న చొరవ, సహకారం అందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.