ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ లా ఆధ్వర్యంలో అందజేయనున్న ‘డీన్ అవార్డ్ 2022 ఫర్ రీసర్చ్ స్కాలర్ ఎక్స్‌లెన్స్ ఇన్ లా’ ప్రదాన కార్యక్రమాన్ని ఈ నెల 22న నిర్వహించనున్నట్లు ఫ్యాకల్టీ ఆఫ్ లా డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తెలిపారు.
అవార్డు కమిటీ సమావేశాన్ని గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్లో గురువారం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. లా విభాగం చరిత్రలో మొదటిసారిగా న్యాయ పరిశోధక విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని పీజీఆర్ఆర్సీడీఈలోని సెంటెనరీ సెమినార్ హాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య, ప్రత్యేక అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రత్యేక ఆహ్వానితులుగా యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం హాజరవుతారని చెప్పారు.
కార్యక్రమంలో ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరాయ కీలకోపన్యాసం చేస్తారని పేర్కొన్నారు. అవార్డు కోసం దరఖాస్తు చేసిన వారిని మూడు దశల్లో స్క్రూటినీ చేశామని, నిష్పక్షపాతంగా మెరిట్ ఆధారంగానే అవార్డును అందజేస్తామన్నారు.