కోటపల్లి, ఏప్రిల్ 23 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట, వేమనపల్లి.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఈ పది రోజుల్లో 7.07 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. పదమూడో రోజు కోటపల్లి వద్ద 1.30 లక్షలు, వేమనపల్లి వద్ద 50 వేలు, తుమ్మిడిహట్టి వద్ద 8 వేల మంది పుణ్యస్నానాలు చేశారు. జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్ఐ రవి కుమార్‌లు ప్రత్యేక దృష్టి పెట్టారు.
పోలీస్ కంట్రోల్ రూం ద్వారా భక్తులకు సూచనలు అందిస్తూ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కోటపల్లి వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్‌రావ్ పుణ్యసాన్నాలు ఆచరించి పుష్కరుడికి పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం, మజ్జిగ, తాగునీటిని పంపిణీ చేశారు. కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత నది పుష్కరాల ముగింపు పదకొండో రోజు సందర్భంగా ప్రాణహిత నదికి హన్మకొండ జిల్లా శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో హారతి కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేటి(ఆదివారం)తో ముగియనుండడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పుష్కరాల ముగింపు సందర్భంగా ధర్మపురి ఆలయం ఆధ్వర్యంలో హారతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాల్లో పుష్కరఘాట్ ఇన్చార్జి వడ్లూరి అనూష, లైజనింగ్ ఆఫీసర్ ఆర్ రవి కిషన్, సర్పంచ్ గుర్రం లక్ష్మి, రైతుబంధు మండల కన్వీనర్ గుర్రం రాజన్న,పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మారిశెట్టి విద్యాసాగర్, భక్తులు కన్యాలాల్ శ్యాం సుందర్ దేవ్డా, పిల్లి సమ్మయ్య, నీల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
తుమ్మిడిహట్టి వద్ద..: కౌటాల, ఏప్రిల్ 23 : తుమ్మిడిహట్టి పుష్కరఘాట్ జనసంద్రంగా మారింది. భక్తులు అస్వస్థతకు గురైతే ప్రథమ చికిత్స అందించేందుకు 108 అంబులెన్స్, వైద్య, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. శానిటేషన్ సిబ్బంది నిరంతరం పారిశుధ్య పనులు చేస్తున్నారు. తుమ్మిడిహట్టి వద్ద సాయంత్రం గంగా హారతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు విశ్వనాథ్, నానయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మాంతయ్య, డీఎస్పీ కరుణాకర్, పుష్కర ఘాట్ ఇన్చార్జి వేణుగోపాల్గుప్తా, ఎంపీఓ శ్రీధర్‌రాజు, సీఐ బుద్దే స్వామి, ఎస్ఐ మనోహర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వొజ్జల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వేమనపల్లి వద్ద..: వేమనపల్లి, ఏప్రిల్ 23 : వేమనపల్లికి శనివారం ఐదు గంటలకే భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. వాహనాలతో పార్కింగ్ స్థలం నిండిపోయింది. మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. దీపాలు వదిలారు. అనంతరం భక్తులకు వడ్డించారు. డీపీవో నారాయణరావు పుష్కరం స్నానం ఆచరించి పితృదేవతలకు పిండప్రదానం చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌రావు, జడ్పీటీసీ స్వర్ణలత, ఎంపీపీ గణపతి, సర్పంచు మధూకర్, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ భీమయ్య,నాయకులు లక్ష్మీకాం త్, కో-ఆప్షన్ సభ్యుడు ముజ్జు, వెంకటేశం, లింగాగౌడ్,సర్పంచ్‌లు బాపు, పద్మ, శ్రీనివాస్, రాజేశ్వరి పాల్గొన్నారు.
కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత పుష్కరాల నేపథ్యంలో ప్రతిరోజూ డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో నది తీరంలో తనిఖీలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పుష్కరాలు జరుగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు తనిఖీలను నిర్వహిస్తున్నారు.
కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత నది వద్ద హెలిక్యాప్టర్ గాలిలో చక్కర్లు కొట్టింది. మహారాష్ట్రలోని సిరొంచలో జరుగుతున్న ప్రాణహిత పుష్కరాలకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెలిక్యాప్టర్‌లో వచ్చారు. జన సందడిని తిలకించేందుకు హెలిక్యాప్టర్లు చక్కర్లు కొట్టగా, కింద ఉన్న జనాలు ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు.
కోటపల్లి, ఏప్రిల్ 16 : పుష్కరస్నానం చేస్తే పుణ్యం వస్తుందని మా తాతలు చెప్పారు. అందుకే సుదూర ప్రాంతాల నుంచి కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత నదిలో పుష్కర స్నానానికి వచ్చా. పాపాలు తొలిగి పుణ్యం వస్తుందని భావిస్తున్నా.
– శివశర్మ, విశాఖపట్నం, బ్రాహ్మణుడు
కోటపల్లి, ఏప్రిల్ 16 : పుష్కరాల కోసం హైదరాబాద్ నుంచి అర్జునగుట్టకు వచ్చా. పుష్కర స్నానం చేస్తే మంచి జరుగు తుందని మా పెద్దలు చెప్పడంతో కుటుం బ సభ్యులతో ఉదయాన్నే అర్జునగుట్టకు చేరుకున్నాం. పుష్కరతీరం విశాలంగా ఉండడం వల్ల భక్తులు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
– వేముల రమ్య, హైదరాబాద్