2 ఎకరాల్లో సంవత్సరం పొడవునా పూలసాగు..
తాతల కాలం నుంచి పూల సాగుపై జీవనం..
ప్రతి రోజూ ఆదాయం..
కొడంగల్, నవంబర్ 29: ప్రభుత్వం తరపున అన్నిరకాల ప్రోత్సాహం అందుతున్నప్పటికీ కూలీల కొరత తదితర సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ఆరు కాలం కష్టపడి పండించుకున్న పంటను కాపాడుకోవాలన్నా వాతావరణ పరిస్థితులు సహకరించడం లేదని, సరైన సమయంలో వర్షాలు కురవడం, కురవక పోవడం వంటి సమస్యలతో రైతులు నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. పండించుకున్న తరువాత పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ, ఆయా సందర్భాల్లో ఇబ్బందుల తప్పడం లేదని వాపోతున్నారు. వేలకు వేలు ఖర్చుపెట్టి పంట సాగు చేసుకుంటే వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా పంట పండకపోవడం, చీడపీడల బాధ పెరిగి ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి కూడా లభించడం లేదని పేర్కొంటున్నారు. వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి పంటసాగు చేసుకుంటే లాభాలు అర్జించుకునే ఆస్కారం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
మండలంలోని చిట్లపల్లి గ్రామానికి చెందిన తమ్మళి బస్వరాజ్తనకున్న 14 ఎకరాల సాగు భూమిలో వివిధ రకాల పంట సాగు చేపట్టినా ఆశించినంత ఫలితం లేకుండా పోవడంతో పూలసాగు ప్రారంభించాడు. దీంతో ఆశించిన స్థాయిలో దినసరి ఆదాయం చేతికి అందడంతో మరో ఎకరంలో పూలసాగును కొనసాగిస్తున్నాడు. తండ్రి బస్వరాజ్ చూపిన బాటలో కుమారులు అశోక్, రమేష్‌లు వృత్తిని కొనసాగిస్తూ మరొకరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు రైతులు దసరా దీపావళిని పురస్కరించుకొని బంతి పూల సాగు చేస్తారు. కానీ చిట్లపల్లి వాసులు ఆవిధంగా కాకుండా సంవత్సరంలో 365 రోజులు పూలసాగును నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఒకపక్క పూలసాగు, మరోపక్క దండలు కట్టి అమ్మడం, అలంకరణ చేయడంతో ప్రతిరోజూ ఆదాయం పొందుతున్నారు.
తాతల కాలం నుంచి..
తాతల కాలం నుంచి అనుసరిస్తున్న చేతి వృత్తిని వదులుకోకుండా రెండు ఎకరాల పొలంలో పూలతోటను సాగు చేసుకుంటూ ఆర్థిక లాభాన్ని పొందుతున్నట్లు తెలిపారు. బంతి, చామంతి, జర్మన్ చామంతి, కనకాంబరాల పూల సాగు సంవత్సరం పొడవునా చేస్తూనే ఉంటారు. దసరా, దీపావళి వేడుకల సమయంలో బంతి పూలు చేతికి అందివస్తాయని, అప్పట్లో మంచి ధర కలిగి ఉండటంతో పాటు లాభాలు కూడా మంచిగానే ఉంటాయని తెలిపారు. శుభకార్యాలకు, పూజలు వంటి వాటికి ప్రత్యేకంగా ఆర్డర్లు తీసుకోవడం పూలతో అలంకరించడం వల్ల మంచి ఆదాయం ఉంటుందని తెలిపారు. సాధారణ వేళల్లో కూడా సాగు చేసుకొని ప్రతి రోజు దుకాణాల్లో, ఇండ్లలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. శివరాత్రి నుంచి వేడుకల సీజన్ ప్రారంభంతో అధిక మొత్తంలో పూల గిరాకీ ఉండి చేతినిండా పని ఉంటుందని, కుటుంబ సభ్యులు మొత్తం పూల అల్లిక చేపట్టడంతో పాటు మరో ముగ్గురు నలుగురికి జీవనోపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పండిన పూలను దండలు, మాలలుగా అల్లుకొని ప్రతి రోజు ఉదయం గ్రామం నుంచి కొడంగల్ పట్టణానికి చేరుకొని మధ్యాహ్నం వరకు ఇండ్లతో పాటు షాపుల్లో, మార్కెట్లో అమ్ముతుంటారు. జర్మన్ చామంతి మూర రూ.10, కనకాంబరం మార్కెట్ డిమాండ్‌ను బట్టి రూ.20 నుంచి 40 వరకు ధర వస్తుందని తెలిపారు. దినసరి రూ.300ల నుంచి రూ.500ల వరకు సంపాదన ఉంటుందని, మధ్యాహ్నం నుంచి తోట,చేను పనులు చేపట్టుకుంటూ ఆనందం జీవితాన్ని గుడుపుతున్నట్లు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్ నుంచి పూలు తెచ్చి అమ్ముకుంటే గిటుబాటు ఉందని, రవాణా ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి పూలు వచ్చే వరకే చాలా సమయం పడుతుందని, వాటిని అల్లి మార్కెట్ తీసుకోవడం కష్టంగా కూడా ఉంటుందని తెలిపారు. ఇక్కడే సాగు చేసుకుంటే తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడిని సాధించి అనుకున్న సమయంలో పూలు అందించుకునే ఆస్కారం ఉటుంది కాబట్టే సాటు చేసుకొంటున్నామని తెలిపారు. వివాహాల సమయంలో అధికంగా పూల గిరాకీ ఉంటుందని అప్పట్లో హైదరాబాద్ మార్కెట్‌కు వెళ్లి పూల కొనుగోలు చేసుకొని వస్తామన్నారు. వీలైనంత వరకు స్వయంగా సాగుచేసుకోవడం ఉత్తమంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
పూల సాగుతో పాటు వ్యవసాయం..
తాతల కాలం నుంచి కొనసాగుతున్న వృత్తిని వదులుకోలేక, రోజువారీగా ఆదాయం వస్తుండటం వల్ల పూల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాము. వ్యవసాయం కంటే పూల సాగుపై ఆదాయం ఎప్పటి కప్పుడు చూసుకోగలుగుతున్నాము. మా ఇంటి సభ్యులందరం పూలను అల్లడంతోపాటు మరి కొందరికి జీవనోపాధి కలుగుతున్నది. సంవత్సరంలో 365రోజులు పూల అమ్మకాలు చేపడుతుంటడంతో మార్కెట్లో మంచి పేరు ఉంది. ఎటువంటి శుభకార్యాలు ఉన్నా వెంటనే ఫోన్ ద్వారా ఆర్దర్ తీసుకొని,అలంకరణ చేస్తున్నాము. కష్టం అధికంగా ఉన్నా ప్రతి రోజు ఆదాయం సంతోషాన్ని కలిగిస్తున్నది. పెద్దమొత్తంలో పూల సాగు చేసుకోవాలని ఉన్నా కూలీల కొరత వల్ల ఉన్నంత వరకే ఇంటి వాళ్లం చేసుకుంటున్నాము.
-అశోక్, పూలతోట యజమాని, చిట్లపల్లి