e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home జిల్లాలు వరికి బదులుగా ‘ఆరుతడి’ సాగు పెంచడమే లక్ష్యం

వరికి బదులుగా ‘ఆరుతడి’ సాగు పెంచడమే లక్ష్యం

  • ఇప్పటికే మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు
  • రంగారెడ్డి జిల్లాలో 940 సంఘాలు.. 10,031 మంది సభ్యులు
  • పప్పు దినుసులు, కూరగాయల సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యం
  • సంఘాల ద్వారానే సాగు, ఉత్పత్తుల విక్రయం.. దళారీ వ్యవస్థకు చెక్‌
  • వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో అవగాహన
  • సంఘాల నిర్వహణకు రూ.50 లక్షలు మంజూరు

రంగారెడ్డి, నవంబర్‌ 29, (నమస్తే తెలంగాణ);ప్రత్యామ్నాయ పంటల సాగును పెంచడమే లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ముందుకెళ్తున్నది. ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ వరి సాగుతో కలిగే నష్టాలు, ఆరుతడి పంటలతో వచ్చే లాభాలపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తుండగా.. తాజాగా మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో పప్పు దినుసులు, కూరగాయల సాగు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పక్కాగా ప్రణాళికలు రూపొందించారు. సంఘాల ద్వారా చేపట్టే ప్రత్యామ్నాయ పంటల సాగు ఖర్చుకు మెంబర్‌షిప్‌ డబ్బులతోపాటు ప్రభుత్వ నిధులను వినియోగించనున్నారు. ఇప్పటికే సంఘాల నిర్వహణకు సర్కార్‌ సెర్ప్‌ ద్వారా రూ.50లక్షలు మంజూరు చేసింది. వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో పంటలసాగుపై సంఘాల సభ్యులకు అవగాహన కల్పించనున్నారు. సాగుతోపాటు పంట ఉత్పత్తుల విక్రయం కూడా సంఘాల ద్వారానే చేపట్టనుండడంతో దళారీ వ్యవస్థకు పూర్తిగా అడ్డుకట్ట పడనున్నది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 940 మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు ఉండగా.. 10,031 మంది సభ్యులు ఉన్నారు.

రంగారెడ్డి జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోమని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో జిల్లా రైతాంగం ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లేలా ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తుండగా.. మరోవైపు మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా పంటల సాగును వీలైనంత మేరకు పెంచేందుకుగాను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పక్కా ప్రణాళికను రూపొందించారు. జిల్లాలో అధికంగా రైతులు కూరగాయలు, పప్పుదినుసుల పంటలను సాగు చేసేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఓ వైపు రైతులను ప్రొత్సహిస్తూనే, మరోవైపు వ్యవసాయ కుటుంబాలైన మహిళా సంఘాల సభ్యుల ద్వారా కూడా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో చేసే ప్రత్నామ్నాయ పంటల సాగుకు అయ్యే ఖర్చును ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు మెంబర్‌షిప్‌ డబ్బులతోపాటు సెర్ప్‌ ద్వారా ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుతో దళారీ వ్యవస్థకు పూర్తిగా చెక్‌ పడనుంది.

- Advertisement -

తక్కువ సమయం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించి ప్రతీ రైతు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు నిర్ణయించారు. జిల్లాలో ఎక్కువగా ఎర్ర, నల్లరేగడి నేలలే ఉన్న నేపథ్యంలో సంబంధిత నేలలకు అనుగుణంగా కూరగాయలు, పప్పుదినుసుల పంటలను సాగు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది. కూరగాయల సాగులో భాగంగా టమాట, ఆకుకూరలు, క్యాలీఫ్లవర్‌, క్యారెట్‌ తదితర పంటలు, పప్పు దినుసుల పంటల్లో భాగంగా కందులు, పెసలు, వేరుశనగ, కుసుమ, పొద్దుతిరుగుడు, మినుములు తదితర ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు దృష్టి సారించేలా మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు వ్యవసాయ శాఖతోపాటు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించనున్నారు.

940 సంఘాలు.. 10031 మంది సభ్యులు
జిల్లాలో 940 మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు, ఆ సంఘాల్లో 10031 మంది సభ్యులున్నారు. మహిళా సంఘాల్లో సభ్యులై ఉండి, చిన్న, సన్నకారు(5 ఎకరాలలోపు భూమిగల) వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారిని సంఘాల సభ్యులుగా చేర్చుకున్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనలతో ఆయా ప్రాంతాల్లో అనువుగా ఉన్న భూములను బట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయనున్నారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల్లో సభ్యులుగా చేరినవారు ఒక్కొక్కరు రూ.600 తమ షేర్‌గా సంఘాల నిర్వహణకు పెట్టుబడి పెట్టనున్నారు. ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో చేసే సాగుకు అవసరమయ్యే వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను కూడా సబ్సిడీతో ప్రభుత్వమే అందించనుంది. మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందనున్నాయి కాబట్టి విత్తనాలు, ఎరువులు, తదితర సాగుకయ్యే అవసరాలను నేరుగా ప్రభుత్వం నుంచి ఉత్పత్తిదారుల సంఘాలకు చేరనున్నాయి. దీంతో దళారుల చేతిల్లో మోసపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు, ఎరువులు పొందవచ్చు. అంతేకాకుండా పంట చేతికొచ్చిన అనంతరం నేరుగా ఉత్పత్తిదారుల సంఘం సేకరించి నేరుగా విక్రయించనుంది. మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల నిర్వహణకుగాను ఇప్పటికే సెర్ప్‌ ద్వారా రూ.50 లక్షల నిధులను కూడా మంజూరు చేసింది.

జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రత్యేక ప్రణాళిక : కలెక్టర్‌ అమయ్‌కుమార్‌
జిల్లాలో వరికి బదులుగా ప్రతీ రైతు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి. ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులు అధిక లాభాలను ఆర్జించి, ఆర్థికంగా వృద్ధి చెందవచ్చు. ప్రత్యామ్నాయ సాగుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాం. ఓ వైపు రైతులకు అవగాహన కల్పిస్తూనే, మరోవైపు మహిళా సంఘాల చిన్న, సన్నకారు రైతు కుటుంబాల్లోని సభ్యులతో మహిళా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో కూరగాయలు, పప్పుదినుసుల పంటలను సాగు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement