
కంది, నవంబర్ 29 : ఐఐటీ హైదరాబాద్‌లో విద్యాభాస్యం పూర్తి చేసిన విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తారని బోర్డ్ ఆఫ్ గవర్నర్ బీ.వీ.మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఐఐటీహెచ్ ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు పూర్వ విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా బీ.వీ.మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులంతా యువతకు ఉపాధి కల్పించేలా స్టార్ఆఫ్ సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా వారు ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన వారే కాకుండా దేశంలోని నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.25 లక్షల నగదును ఐఐటీహెచ్‌లో క్లాస్‌రూంలను మరింత డిజిటల్ చేసేందుకు విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఐఐటీ డైరెక్టర్ బీ.ఎస్.మూర్తి మాట్లాడారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చేందుకు వెనుకాడకూడదన్నారు.
నలుగురు పూర్వ విద్యార్థులకు ఉత్తమ అవార్డులు..
పూర్వ విద్యార్థులను ప్రోత్సహించేలా ఏర్పాటు చేసిన ఈ ‘ఆలుమ్ని డే’ (పూర్వ విద్యార్థులు రోజు)న గతంలో పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బీ.వీ.మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఇందులో 2018 సంవత్సరానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎల్.ఏకు చెందిన డాక్టర్ అనిందిత ఘోష్‌కు అకాడమి ఎక్సెలెన్స్ అవార్డును అందజేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సీహెచ్‌వై (2016)కు చెందిన రిని చౌదరికి ఉమెన్ ఆలుమ్ని ఎక్సెలెన్స్ అవార్డు, సీఈ డిపార్ట్మెంట్ (2012)కు చెందిన డాక్టర్ మహేంద్ర కుమార్ పాల్‌కు ఎక్సెలెన్స్ ఇన్ ఆలుమ్ని రిలేషన్ అవార్డు ప్రధానం చేశారు. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఈఈ (2013)కు చెందిన షహబాష్ బషీర్ పాటిల్‌కు ఎక్సెలెన్స్ ఇన్ టెక్నోలాజికల్ ఇన్నోవేషన్స్ అవార్డు అందుకున్నారు.