
బాధితుల ఆందోళన
పైసలు తిరిగిచ్చిన యజమాని
వెల్దుర్తి, నవంబర్ 29 : మండల కేంద్రమైన వెల్దుర్తి శివారులో ఉన్న భారత్ పెట్రోల్ పంపులో కల్తీ పెట్రోల్ రావడంతో బాధితులు సోమవారం ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు భారత్ పెట్రోల్ పంపులో పెట్రోల్ పోసుకున్న బైక్‌లు స్టార్ట్ కాకపోవడం, మధ్యలో ఆగిపోవడం, ఇతర సమస్యలు రావడంతో గమనించిన బండపోసాన్‌పల్లి, వెల్దుర్తి, ఎలుకపల్లి గ్రామాలకు చెందిన పలువురు వాహనదారులు బైక్‌లో పోయించిన పెట్రోల్‌ను తీసి, ఇతర పెట్రోల్ బంకులోని పెట్రోల్‌తో పోల్చి చూడగా, రంగులో తేడా ఉండడం, డీజిల్ వాసన రావడం, ఆవిరి కాకపోవడంతో గమనించిన బాధితులు కల్తీ పెట్రోల్ బాటిళ్లతో భారత్ పెట్రోల్ పంపు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. అనంతరం బాధితులు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌రావుకు వినతిపత్రం అందజేశారు. వెంటనే డిప్యూటీ తహసీల్దార్ స్పందించి ఆర్ఐ నర్సింహారావుతో కలిసి పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. పంపు యజమానులు డిప్యూటీ తహసీల్దార్‌తో మాట్లాడారు. గత శుక్రవారం రాత్రి పెట్రోల్ ట్యాంకులను శుభ్రం చేశామని, రెండు రోజుల పాటు పెట్రోల్ పంపును మూసివేసి ఆదివారం సాయంత్రం తెరిచామని తెలిపారు. శుభ్రం చేసిన అనంతరం తీసివేయాల్సిన పెట్రోల్‌ను సిబ్బంది నిర్లక్ష్యంతో వాహనాల్లో పోశారన్నారు. వాహనదారులకు తిరిగి డబ్బులు చెల్లించడంతో పాటు మరమ్మతులు చేయిస్తామని భారత్ పెట్రోల్ పంపు యజమాని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు డిప్యూటీ తహసీల్దార్ కల్తీ పెట్రోల్ నమూనాలను సేకరించి, పంచనామా నిర్వహించారు. కల్తీ పెట్రోల్‌ను పరీక్షల కోసం పంపుతామని, వచ్చిన రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు తాత్కాలికంగా పెట్రోల్ పంపును మూసివేస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ వెంట వీఆర్వోలు భూలక్ష్మి, ఉన్నారు.