జనవరి 3వ తేదీ నుంచి పిల్లలకు సైతం కరోనా టీకా
ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం
అన్ని పీహెచ్‌సీల్లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
రంగారెడ్డి జిల్లాలో 15-18 ఏండ్ల లోపువారు 2,24,664 మంది
వికారాబాద్ జిల్లాలో 77,780 మంది..
రంగారెడ్డి, డిసెంబర్ 28, (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. జనవరి 3 నుంచి 15-18 ఏండ్ల వయసు వారికి సైతం టీకా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. 1 నుంచి రిజిస్ట్రేషన్‌కు అవకాశమిచ్చింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆధార్‌కార్డు లేనివారు విద్యార్థి గుర్తింపు కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించారు. అన్ని పీహెచ్‌సీల్లో టీకా పంపిణీ చేయనుండగా.. సరిపోను డోస్‌లు అందుబాటులో ఉంచుతున్నారు. 15-18 ఏండ్ల లోపు వారు రంగారెడ్డి జిల్లాలో 2,24,664 మంది, వికారాబాద్ జిల్లాలో 77,780 మంది ఉన్నారు.
ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా కొవిడ్ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు 18 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే కొవిడ్ టీకాను ఇవ్వగా, ఇకపై 15-18 ఏండ్ల లోపు ఉన్న వారికి కూడా కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 3వ తేదీ నుంచి 15-18 ఏండ్ల లోపు ఉన్న పిల్లలందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయి తే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు తప్పనిసరిగా వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రా రంభం కానుంది. మరోవైపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొవిన్ యాప్‌లో ఆధార్ కార్డు, ఆధార్ కార్డు లేని వారు విద్యార్థి గుర్తింపు కార్డుతో వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరోవైపు 15-18 ఏండ్లలోపు ఉన్న వారికి టీకాను అందించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా, ఇకపై 15-18 ఏండ్ల లోపు వారికి కూడా వ్యా క్సిన్ వేసేందుకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. అయితే జిల్లాలో 15-18 ఏండ్ల లోపు వారు 2,24,664 మంది ఉండగా, వీరిలో బా లురు-1,14,556 మంది, బాలికలు-1,10,108 మంది ఉన్న ట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు లెక్కతేల్చారు.
ఇప్పటివరకు 44.43 లక్షల డోసులు పూర్తి
రంగారెడ్డి జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ టీకాల పంపిణీని పెంచారు. జిల్లాలో ఇప్పటివరకు 44.43 లక్షల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. వీటిలో మొదటి డోస్ 26,32,469 డోసులు, రెండోడోస్ 18,11,524 వ్యాక్సిన్ వేశారు. అయితే సెకండ్ డోసుకు సంబంధించి మరో 4 లక్షల డోసులు వే యాల్సి ఉంది. ఆ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా పెం డింగ్‌లో ఉన్నది. అయితే జిల్లాలో రోజుకు 18-20 వేల డోసుల వరకు టీకాలను వేస్తున్నారు. ఈనెలాఖరులోగా వంద శా తం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, అన్ని మండలా లు, గ్రామాల్లోని ప్రజలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించడంతోపాటు క్షేత్రస్థాయికెళ్లి మరీ వైద్యబృందాలు టీకాలను పంపిణీ చేస్తున్నాయి. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా 28 మొబైల్ వాహనాల ద్వారా అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నారు. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వ్యాక్సినేషన్‌పై ఇంటింటికెళ్లి ఆరా తీస్తున్నారు. టీకా వేసుకొని వారుంటే వారు వేసుకునేలా సూచిస్తున్నారు.
జిల్లాలో సరిపడా వ్యాక్సిన్ ఉంది..
15-18 ఏండ్ల లోపు ఉన్న పిల్లలకు కొవిడ్ టీకా పంపిణీకి ఏర్పాట్లు చేస్తు న్నాం. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 15-18 ఏండ్ల లోపు వారందరూ టీకా తీసుకొనేందుకు ముందు గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా 18 ఏండ్లు పైబడిన వారందరికీ సెకండ్ డోస్ టీకా ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేస్తాం.
-డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి