అదనపు కలెక్టర్ చంద్రయ్య
మొరంగపల్లిలో కేంద్ర బృందం పర్యటన
మోమిన్‌పేట, డిసెంబర్ 28 : గ్రామాల్లో కలిసికట్టుగా పారిశుధ్యాన్ని పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ కేంద్ర బృందంతో పర్యటించి పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవడంతోపాటు వాడుకుంటూ బహిరంగా మల విసర్జనకు దూరంగా ఉండాలన్నారు. ఇంట్లో నుంచి మురికినీరు రోడ్లపైకి రాకుండా ఇంటింటికీ ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి పంచాయతీ ట్రాక్టర్లో వేయాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామపంచాయతీలు, ఆలయాలు, మసీదులు, ప్రార్థన స్థలాలు, సామూహిక ప్రదేశాల్లో పారిశుధ్య వసతుల్లో నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సంస్థ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై పరిమాణాత్మక, గుణాత్మకమైన పరిశీలన సర్వే నిర్వహించి గ్రామాలకు ర్యాంకింగ్ ఇస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందం పరిశీలకులు రఘు, ప్రసాద్, ఎంపీడీవో శైలజారెడ్డి, ఎంపీవో యాదగిరి, ఏపీవో శంకర్, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
కేసీతండాలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే
యాచారం, డిసెంబర్ 28 : మండలంలోని కేసీతండాలో కేంద్ర బృందం సభ్యుడు నరేశ్ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. గ్రామంలో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, నర్సరీ, కంపోస్టు యార్డును పరిశీలించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన సీసీరోడ్లు, పారిశుధ్యం, భూగర్భ డ్రేనేజీలను సైతం పరిశీలించారు. గ్రామంలో తడి, పొడి చెత్త, వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న అంగన్వాడీ, పాఠశాల, గ్రామపంచాయతీ, గుడి, వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు. గ్రామంలో చేట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గ్రామంలోని స్వచ్ఛతను బట్టి స్వచ్ఛత మార్కులు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మారు, డీఎల్పీవో సంధ్యారాణి, ఎంపీడీవో మమతాబాయి, ఎంపీవో శ్రీలత, టీఆర్ఎస్ నాయకులు శంకర్‌నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.