చేవెళ్ల టౌన్, డిసెంబర్ 28 : ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. సభలో ఒక్కో అధికారి తమ ఎజెండాను చదివి వినిపించారు. వ్యవసాయ శాఖ అధికారి కృష్ణమోహన్ రైతు బంధు పోర్టల్ ఓపెన్ అయ్యిందని, నూతన పట్టా పాస్ పుస్తకం వచ్చిన వారు ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని అదేవిధంగా యాసంగిలో వరికి బదులు ఇతర ఆరు తడి పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు అప్పగించే విధంగా తీర్మానం చేయాలని పలువురు సర్పంచ్‌లు ఎంపీపీని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే వారికి జీతాలు సకాలంలో అందకపోవడంతో వండటానికి నిరాకరిస్తున్నారని, సమస్యలు పరిష్కరించాలని దేవునిఎర్రవల్లి సర్పంచ్ సామ మాణిక్యరెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఎంఈవో అక్బర్ స్పందించి నవంబర్ వరకు జీతాలు చెల్లించడం జరిగిందని, మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని రెండు సంవత్సరాల నుంచి విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రావులపల్లి సర్పంచ్ శ్రీనివాస్, కేసారం సర్పంచ్ రమేశ్‌గౌడ్ విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరు గ్రామంలో 50 స్తంభాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించినా ఇంతవరకు స్తంభాలు ఏర్పాటు చేయలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎంపీపీ వెంటనే ఆలూరు గ్రామంలోని సమస్య పరిష్కరించాలని ఏఈని ఆదేశించారు. అనంతరం ఎంపీపీ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని, గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను అందరి సహకారంతో 100 శాతం పూర్తయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాలతి, డీటీ వినోద్‌కుమార్, ఎంపీడీవో హరీశ్ కుమార్, ఎంఈవో అక్బర్, డీఈ, సంబంధిత శాఖల అధికారులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.