e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home జిల్లాలు ‘ఆరుతడి’లాభాల ఒరవడి

‘ఆరుతడి’లాభాల ఒరవడి

ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యం
రైతు వేదికల్లో చైతన్య సదస్సులు
కూరగాయల సాగు పెంచేందుకు మరిన్ని క్రాప్‌ కాలనీలు
ప్రత్యామ్నాయపంటల విత్తనాలు సిద్ధం
పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలపై కరపత్రాలు, గోడ పత్రికలతో ప్రచారం
ఏ పంట వేస్తే ఎంత లాభామొస్తుందన్న దానిపై బుక్‌లెట్‌
సబ్సిడీపై స్ప్రింక్లర్లు, డ్రిప్‌ పరికరాలు

ఇబ్రహీంపట్నం, నవంబర్‌ 28 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసేలా నేటి నుంచి విస్తృత ప్రచారం చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. రైతు వేదికల్లో చైతన్య సదస్సులను నిర్వహించి ప్రత్యామ్నాయ పంటలతో వచ్చే లాభాలను రైతులకు వివరించనున్నది. మినుములు, పెసర్లు, వేరుశనగ, శనగ, నువ్వులు, ఆముదాలు, కందులు, పొద్దు తిరుగుడు, జొన్న, కుసుమ పంటల సాగు విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన విత్తనాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలపై కరపత్రాలు, గోడపత్రికలతోనూ ప్రచారం చేయనున్నారు. ఏ పంట వేస్తే ఎంత లాభమొస్తుందన్న దానిపై బుక్‌లెట్‌ను అన్నదాతలకు అందించనున్నారు. కూరగాయల సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని క్రాప్‌ కాలనీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సబ్సిడీపై స్ప్రింక్లర్లు, డ్రిప్‌ పరికరాలను అందించి అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలువనున్నది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే భూసారం పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది మరో లక్ష ఎకరాల్లో ఆరుతడి పంటలైన కూరగాయలు, పప్పుదినుసులను సాగుచేసేలా వ్యవసాయశాఖ సన్నద్ధమైంది. సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా రైతు వేదికల ద్వారా చైతన్య సదస్సులు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు వేదికల ఆధ్వర్యంలో గ్రామాలవారీగా సదస్సులు నిర్వహించి ఆరుతడి పంటలు వేయడంవల్ల వచ్చే లాభాల గురించి రైతులకు వివరించనున్నారు. గత సంవత్సరం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో వరిసాగు చేశారు. ఈ లక్ష ఎకరాల్లో మినుములు, పెసర్లు, వేరుశనగ, నువ్వులు, ఆముదాలు, కందులు, పొద్దు తిరుగుడు, పశుగ్రాసంతో పాటు కూరగాయల తోటలను సాగు చేసుకునేలా రైతుల్లో అవగాహన పెంచే కార్యక్రమానికి వ్యవసాయ, ఉద్యానవనశాఖలు నడుం బిగించాయి. ఈ విత్తనాలను కూడా వ్యవసాయశాఖ రైతులందరికీ అందుబాటులో ఉంచింది. మార్కెట్‌లో వరికి డిమాండ్‌ తగ్గిన నేపథ్యంలో డిమాండ్‌ ఉన్న ఆరుతడి పంటలు, కూరగాయల పంటలను సాగుచేసుకునేలా రైతులను ప్రోత్సహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

- Advertisement -

వరి సాగు చేసిన పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలైన పప్పుదినుసులు సాగుచేస్తే భూసారం పెరుగడంతో పాటు భూమిలో ఉండే బ్యాక్టీరియా కూడా చనిపోయే అవకాశాలున్నాయని వ్యవసాయ నిపుణులు గుర్తించారు. ఈమేరకు పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను కూడా రైతులకు వివరించేలా కరపత్రాలు, గోడపత్రికల ద్వారా ప్రచారం చేసే కార్యక్రమానికి వ్యవసాయశాఖ సిద్ధమైంది. గతేడాది సాగుచేసిన వరితోపాటు మిగిలిన 50వేల ఎకరాల్లో కూడా ఆకుకూరలు, కూరగాయలు, పశుగ్రాసం, పప్పుదినుసులు సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.

విస్తృత ప్రచారం
పప్పుదినుసుల సాగు తక్కువ పెట్టుబడితోపాటు కూలీలు, యంత్రాల అవసరం లేకుండా పంటలు చేతికందుతాయని, ఏ పంట వేస్తే ఎలాంటి లాభాలు వస్తాయనే దానిపై బుక్‌లెట్‌ రూపంలో అధికారులు తయారుచేశారు. ప్రతీ రైతు వేదికకు 600 బుక్కులను అధికారులు అందజేస్తున్నారు. ఈ బుక్కులను రైతులకు పంపిణీ చేసి వాటి ప్రయోజనాలపై ప్రచారం చేయనున్నారు. గడ్డి సాగును కూడా పెద్దఎత్తున ప్రోత్సహించేలా నిర్ణయించారు. ఇందుకోసం గడ్డి సాగు రైతులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కూరగాయల సాగు పెంపునకు మరిన్ని క్రాప్‌ కాలనీలు
రాష్ట్ర రాజధాని చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా నుంచే నగరానికి కూరగాయలను రైతులు ఎగుమతి చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ పెద్దఎత్తున కూరగాయలను తరలిస్తున్నారు. జిల్లాలో కూరగాయలు సాగు చేసే రైతులు అధికంగా ఉండడం వలన వారిని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని క్రాప్‌ కాలనీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కూరగాయలను అధికంగా పండించేందుకు క్రాప్‌ కాలనీలను ఏర్పాటు చేసింది. ఈ కాలనీల్లో రైతులకు కూరగాయల పంటలకు సంబంధించిన నారును ప్రభుత్వమే అందించింది. ఈ క్రాప్‌ కాలనీల విధానాన్ని జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. క్రాప్‌ కాలనీల్లో పంటలు సాగు చేసుకునే రైతులకు స్ప్రింక్లర్లు, డ్రిప్‌ వంటి వాటికి కూడా సబ్సిడీ అందజేస్తున్నది.

అదనంగా లక్ష ఎకరాల్లో ఆరుతడి పంటల సాగుకు సమాయత్తం : గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది అదనంగా మరో లక్ష ఎకరాల్లో పప్పుదినుసులు, కూరగాయలు, ఆకుకూరల పంటలను సాగు చేసుకునేలా రైతులను సమాయత్తం చేస్తున్నాం. గతేడాది లక్ష ఎకరాల్లో వరి సాగు చేశారు. ఆ లక్ష ఎకరాల్లో ఈ సంవత్సరం వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటల వల్ల కలిగే లాభాలపై రైతులకు వివరించేందుకు సోమవారం నుంచి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement