తుదిదశకు ఉద్యోగుల పునర్విభజన
కొత్త జిల్లాలకు అనుగుణంగా పోస్టింగులు
ఆరు జిల్లాలకు కేటాయింపులు
జిల్లా మారిన వారికి కౌన్సెలింగ్
ఎల్లుండి కొత్త పోస్టింగ్‌ల ఉత్తర్వులు
ఉమ్మడి జిల్లాలో 20వేల మంది ఉద్యోగులు
అన్ని కేటగిరీల్లో 10వేల మంది టీచర్లు
వరంగల్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొత్త జోన్లు, మల్టీ జోన్లు, కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఏర్పడిన వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, అలాగే సిద్ధిపేట జిల్లాలకు వారు పెట్టుకున్న ఆప్షన్ల మేరకు సీనియార్టీ జాబితా ఆధారంగా కేటాయింపులు జరుగగా కౌన్సెలింగ్ జరుగుతోంది. నోడల్ అధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాగుతుండగా జిల్లాలు మారిన వారందరికీ ఈ నెల 30న కొత్త పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని శాఖల్లో కలిపి మొత్తం 20,227మంది ఉద్యోగులు, 10,590మంది టీచర్లున్నారు.
జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తవుతోంది. ఆప్షన్ల మేరకు సీనియారిటీ జాబితా ఆధారంగా అయా జిల్లాలకు ఇప్పటికే వారిని కేటాయించారు. జిల్లాలు మారిన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కొత్త జోనల్, జిల్లాల విధానానికి అనుగుణంగా ఉద్యోగుల పునర్విభజన ప్రక్రియకు నోడల్ అధికారిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ హనుమంతు రాజీవ్‌గాంధీ వ్యవహరిస్తున్నారు. ఆయా డిపార్ట్మెంటులోని హనుమకొండ జిల్లా ఉన్నతాధికారి ఆధ్వర్యంలో సీనియారిటీ జాబితాలు సిద్ధమయ్యాయి. వీటికి అనుగుణంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులను జిల్లాలకు కేటాయించారు. ప్రభుత్వపరంగా అన్నీ కలిపి 76 డిపార్టుమెంట్లు ఉన్నాయి. వీటిలో 556 కేటగిరీల్లో జిల్లాస్థాయి ఉద్యోగులు 20,227మంది ఉద్యోగులు ఉన్నారు. జిల్లాస్థాయి ఉద్యోగులకు ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ఆధ్వర్యంలో జిల్లాల కేటాయింపు పూర్తయ్యింది. జోన్, మల్టీజోన్ స్థాయి అధికారులకు ఆయా శాఖల ఉన్నతాధికారులు పోస్టింగ్ ఇస్తారు. మంగళవారం ఈ ప్రక్రియ మొదలుకానున్నది.
జిల్లా మారిన వారికే..
కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల పునర్విభజన జరుగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఒక జిల్లాలో పనిచేస్తున్న వారిని అదే జిల్లాకు కేటాయిస్తే కొత్తగా పోస్టింగ్ ఇవ్వడం లేదు. కేటాయింపులో జిల్లా మారిన వారికి కొత్త జిల్లాలో పోస్టింగ్ ఇస్తున్నారు. దీని వల్ల అందరు ఉద్యోగులను మార్చకుండా ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలు మారిన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు సీనియార్టీ, ఆప్షన్లను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, సంబంధిత జిల్లా అధికారి కలిసి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలు మారిన ఉద్యోగులకు పోస్టింగుల కోసం హనుమకొండ జిల్లాలో సోమవారం కౌన్సెలింగ్ జరిగింది. మిగిలిన జిల్లాల్లో మంగళవారం, బుధవారం ఈ ప్రక్రియ జరగనుంది. కౌన్సెలింగ్ అనంతరం జిల్లాలు మారిన అందరికీ కొత్త పోస్టింగులతో ఈ నెల 30న ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా ఉద్యోగుల పునర్విభజన జరుగుతోంది. పరిపాలన అవసరాల కోసం ఉద్యోగుల పునర్విభజనపై కొన్ని ప్రత్యేక శాఖలలో పోస్టింగులపై జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంటుం ది. మారుమూల ప్రాంతాలు, ప్రతి జిల్లాలో ఆయా శాఖల్లోని కనీస సంఖ్యలో ఉద్యోగులు ఉండేలా వెసులుబాటుతో ఉద్యోగులకు పోస్టింగులు ఉంటున్నాయి.
టీచర్లకు..
పునర్విభజనలో భాగంగా జిల్లాలు మారిన టీచర్ల పోస్టింగులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీచర్లకు ఆన్లైన్లో నమోదు చేసిన ఆప్షన్ల ఆధారంగా వీరికి పోస్టింగులు ఇస్తారు. అన్ని కేటగిరీల టీచర్లు కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10,590వేల మంది టీచర్లు ఉన్నా రు. పునర్విభజనలో సీనియారిటీ ఆధారంగా వీరిలో దాదాపు సగం మంది జిల్లాలు మారారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో వీరికి పోస్టింగులు ఇవ్వనున్నారు. ఈమేరకు ఆన్లైన్లో ఆప్షన్లు పెట్టుకోవాలని జిల్లాలు మారిన టీచర్లను ఆదేశించారు.