నేటి నుంచి రైతుబంధు సాయం
వారం రోజుల్లో పంపిణీ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు
నేడు ఎకరా వరకు భూమిగల రైతులకు..
ప్రతి రైతుకు రైతుబంధు సాయం.. ఎకరాకు రూ.5 వేలు
యాసంగిలో రంగారెడ్డి జిల్లాలోని 3,48,556 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో,నేరుగా రూ.376 కోట్ల సాయం జమ
వికారాబాద్ జిల్లాలో 2,57,148 మంది రైతులకు రూ.318 కోట్లకుపైగా మంజూరు
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, డిసెంబర్ 27 :అన్నదాతల శ్రేయస్సు కోసం తెలంగాణ సర్కార్ నిరంతరం కృషి చేస్తున్నది. ఎవుసం పండుగలా సాగాలన్న సదుద్దేశంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. యాసంగి సీజన్‌కు సంబంధించి నేడు ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రూ.5 వేలను జమ చేయనున్నది. వారం రోజుల్లోగా రైతులందరికీ సాయం అందేలా అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. వానకాలం సీజన్‌తో పోల్చితే యాసంగికి రైతుల సంఖ్య పెరిగింది. ఈసారి రంగారెడ్డి జిల్లాలో 3,48,556 మంది రైతులకు రూ.376 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ కానున్నాయి. వికారాబాద్ జిల్లాలో 2,57,148 మంది రైతులకు రూ.318 కోట్లకు పైగా సాయం అందనున్నది. ప్రతిసారి పెట్టుబడి సాయాన్ని అందిస్తుండడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతు బంధు పథకం కింద యాసంగి సీజన్‌కుగాను రైతులకు పంట పెట్టుబడి నిమిత్తం అందజేసే ఆర్థిక సాయాన్ని నేటి నుంచి రైతులకు అందించేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5వేల పెట్టుబడి సాయాన్ని జమ చేయనుంది. రైతు బంధు సాయాన్ని వారం రోజుల్లోగా రైతులకు అందజేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. తొలుత ఎకరాలోపు భూమిగల రైతులకు రైతు బంధు సాయాన్ని నేడు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది, తదనంతరం వారం రోజుల్లో యాసంగి రైతు బంధు సాయాన్ని రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన ప్రతీ రైతుకు రైతుబంధు సాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు రైతులను అప్పుల బారి నుంచి విముక్తి కలిగించడంతోపాటు పెట్టుబడి సాయమందించేందుకుగాను రైతు బంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ 2018 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. యాసంగి సీజన్‌కు సంబంధించి వికారాబాద్ జిల్లాలో 2.57లక్షల మందికి రూ.318 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో 3,48,556 మందికి రూ.రూ.376 కోట్లు వారి ఖాతాల్లో జమ కానున్నాయి.
యాసంగి సీజన్‌కు పెట్టుబడి సాయం
నేటి నుంచి రైతు బంధు సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున యాసంగి పెట్టుబడి సాయం జమకానుంది. ఇప్పటికే ఎకరా భూమిగల రైతులకు సంబంధించి బిల్లులు కూడా పూర్తి కావడంతో మంగళవారం సాయంత్రం వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 3,48,556 మంది, వికారాబాద్ జిల్లాలో 2,57,148 పట్టాదారులను రైతు బంధు పథకానికి అర్హులుగా గుర్తించారు. ప్రభుత్వం గత ఏడాది జూన్ నుంచి ఈ నెల 10 వరకు భూక్రయవిక్రయాలతోపాటు భూ సమస్యలు పరిష్కారమైన పట్టాదారుల వివరాలను సేకరించి యాసంగి సీజన్‌కు మరో 23,761 మందిని కొత్తగా అర్హులుగా తేల్చారు. సంబంధిత రైతులందరికీ వారం రోజుల్లోగా రైతు బంధు సాయమందనుంది. రంగారెడ్డి జిల్లాలో వానకాలం సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది రైతు బంధు పథకానికి సంబంధించి 23,761 మంది పెరిగారు.
రైతులకు సాయమందించిన వివరాలు..
ఇప్పటివరకు 7 విడుతలుగా రైతులకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందజేసిన సర్కారు 8వ విడుతగా ఈ యాసంగిలో డబ్బులు అందజేస్తుంది. 2018 వానకాలం సీజన్లో చెక్కుల రూపంలో ఎకరాకు రూ.4 వేల ఆర్థిక సాయాన్ని అందజేయగా, 2018 యాసంగి సీజన్ నుంచి రైతులకు నేరుగా ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తూ వస్తున్నది. గతేడాది నుంచి రైతుబంధు కింద రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలో 2018 వానకాలం సీజన్లో 2,47,688 మంది రైతులకు రూ.257 కోట్లు, యాసంగిలో 2,21,096 మంది రైతులకు రూ.240 కోట్లు, 2019 వానకాలంలో 2,30,155 మంది రైతులకు రూ.257 కోట్లు, యాసంగిలో 1,87,804 మంది రైతులకు రూ.182 కోట్లు, 2020 వానకాలంలో 2,69,022 మంది రైతులకు రూ.342 కోట్లు, యాసంగిలో 2,74,785 మంది రైతులకు రూ.344 కోట్లు, 2021 వానకాలం సీజన్లో 2,82,094 మంది రైతులకు రూ.343 కోట్ల ఆర్థిక సాయాన్ని ఎకరాకు రూ.5వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి ఇప్పటివరకు 40 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలను సంబంధిత అధికారులు సేకరించారు. అయితే ఇంకా బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలను అందించని రైతులు సంబంధిత అధికారులకు వివరాలను అందజేసినట్లయితే రైతుబంధు సాయమందనుంది.
రైతును రాజుగా చేస్తున్న సీఎం : వంగేటి లక్ష్మారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నంటీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేశారు. గతంలో పంటలు వేసే సమయంలో పెట్టుబడుల కోసం రైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయించేవారు. వారు పండించిన పంటలు పూర్తిగా వడ్డీలకు పోయేది. కాని, రైతు ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ యాసంగిలో, వర్షాకాలం పంటల ప్రారంభంలోనే రైతు బందు ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించి రైతులు ఎవరికీ చేయిచాచే పరిస్థితి లేకుండా చేశారు. గత ఏడు విడుతలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఏడాదికి ప్రతి ఎకరాకు రూ.10వేలు అందజేసి రైతుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నది.
రైతు బంధు ఘనత కేసీఆర్‌దే : వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఇబ్రహీంపట్నం
రైతు బంధు పథకం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావటంలేదు. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు ఎవరికీ చేయి చాచకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పంటలు వేసుకునే సమయానికి ముందుగానే రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందించడంతో రైతులు తలెత్తుకునే పరిస్థితి తీసుకువచ్చారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి రైతులే కాకుండా అన్ని వర్గాల రైతులకు ఈ పథకం వర్తింపజేయడం వలన ఎంతోమంది రైతులు లబ్ధిపొందుతున్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు రైతులంతా రుణపడి ఉంటారు.
కేసీఆర్ రైతు పక్షపాతి : ఉప్పలి చంద్రయ్య, యాలాల
రుణభారం నుంచి రైతులను ఉపశమనం చేసేందుకు రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గొప్ప పథకం రైతు బంధు. గతంలో ఏ ప్రభుత్వమూ మా గురించి ఆలోచించలేదు. సీఎం కేసీఆర్ మన తెలంగాణ ఘన తెలంగాణ అని దేశానికి తెలిసేలా చేశారు. కష్టాలు దూరమైనాయి. మాలాంటి సన్నకారు రైతులకు ఇది వరం. కేసీఆర్ మాలాంటోల్లం నష్టపోకూడదని వరి కొంటుండు. కేసీఆర్ సల్లంగుండాలే.
రైతుల అభివృద్ధికి కృషి : వెంకటేశం, బూచన్‌పల్లి
తెలంగాణ ప్రభుత్వం రైతులను అభివృద్ధికి పాటుపడుతున్నది. గతంలో రైతులు పంటల పెట్టుబడికి చాలా ఇబ్బందులు పడేవారు. సీఎం కేసీఆర్ గుర్తించి రైతు బందు పథకాన్ని ప్రారంభించి పంటల పెట్టుబడికి ఎకరాకు ఏడాదికి 10వేలు అందించి ఆదుకుంటున్నాడు. సరైన సమయంలో పంట పెట్టుబడికి డబ్బులు అందించడం చాలా సంతోషం. కేసీఆర్ సారుకు రైతులందరూ రుణపడి ఉంటాడు.
ఆత్మైస్థెర్యాన్ని పెంచింది : సాయిలు, చిన్ననందిగామ
పంట సాగు చేసుకునేందుకు పెట్టుబడి కోసం అప్పట్లో ఒకరిపై ఆధారపడి వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు అమలు చేస్తున్న రైతు బంధు పథకం రైతుల్లో ఆత్మస్తైర్యాన్ని పెంచింది. ఒకరికి చేయి చాపకుండా ధైర్యంగా పంట సాగు చేసుకునే అవకాశాన్ని కల్పించిన సీఎంకు ధన్యవాదాలు. రైతు బంధు అమలు కాబడుతున్న నాటి నుంచి ధైర్యంగా, సంతోషంగా పంట సాగు చేసుకుంటున్నాం.