
పొడిచేడు, దాచారం వద్ద ఎత్తిపోతలు
ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు..
ప్రభుత్వానికి నివేదిక
ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ ప్రత్యేక చొరవ
అన్నదాతల హర్షం
మోత్కూరు, డిసెంబర్ 27: సాగు నీరు లేక ఏండ్లుగా బీడున్న భూములు త్వరలో సస్యశ్యామలం కానున్నాయి. మూసీ నదిలో వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా వినియోగంలోకి తీసుకురావాలన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సంకల్పం నెరవేరనున్నది. మండలంలోని పొడిచేడు, దాచారం గ్రామాల వద్ద మూసీ నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. దీని ద్వారా 5 వేల ఎకరాలకు సాగు నీరందించాలన్నది లక్ష్యం. ఇప్పటికే చిన్న నీటి పారుదల శాఖ అధికారులు ఇందుకు కార్యాచరణ రూపొందించారు. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) రూపొందించి అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ అనుమతుల కోసం పంపేందుకు సిద్ధమయ్యారు.
దాచారం ఎత్తిపోతల ద్వారా…
దాచారం గ్రామంలోని రామసముద్రం చెరువును నింపేందుకు మూసీ నది వద్ద 2.5 మీటర్ల వెడల్పులో, 15 మీటర్ల లోతులో బావిని నిర్మిస్తారు. అక్కడి నుంచి భూమిలో 200 మీటర్ల పొడవు పైపులైన్ అండర్ గ్రౌండ్ ద్వారా ఏర్పాటు చేయనున్నారు. పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేసిన ప్రభుత్వ భూమిలో పంపు హౌజ్ నిర్మించి, అక్కడి నుంచి 1.8 కిలోమీటర్లు భూమిలో పైపులైన్ ఏర్పాటు చేసి రామసముద్రం చెరువులోకి మూసీ జలాలను తరలించనున్నారు. ఇందుకోసం రూ.5.60 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
వృథా జలాలను ఒడిసి పట్టేందుకు..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బిక్కేరు, మూసీ ఆధారిత కాల్వలను ఆధునికరిస్తున్నది. వృథా పోతున్న జలాలను ఒడిసి పట్టేందుకు మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో మూసీ, బిక్కేరు వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మోత్కూరు మండలం సదర్శాపురంలో రూ.6.80 కోట్లు, అడ్డగూడూరు మండలం చిన్నపడిశాలలో రూ.6.80 కోట్లు, ధర్మారంలో రూ.8 కోట్ల వ్యయంతో బిక్కేరు వాగుపై చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నది. మోత్కూరు మండలం పొడిచేడు, దాచారం గ్రామాల్లో రూ.10.30 కోట్లతో ఎత్తిపోతల పథకం, మోత్కూరులో బిక్కేరు వాగుపై రూ.15 కోట్లతో, కొండగడపలో రూ.9.10 కోట్లతో చెక్ డ్యామ్‌ల నిర్మాణం, రూ.1.75 కోట్లతో మోత్కూరులోని బృందావన్ కాల్వ ఆధునీకరణ పనులకు నిధులు విడుదలయ్యాయి. ఇప్పటికే అధికారులు సర్వే పనులు పూర్తి చేశారు.
రెండు పంటలకు సాగునీరు..
మోత్కూరు, అడ్డగూడూరు మండలాల రైతులకు బిక్కేరు, మూసీ నది నీటితో ఇప్పటి వరకు పెద్దగా ప్రయోజనం కలుగలేదు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. సాగునీటి కల్పనకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నారు. బిక్కేరు, మూసీ వృథా జలాలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు నిర్మిస్తున్న ఎత్తిపోతలు, చెక్‌డ్యాములు పూర్తయితే రైతులకు రెండు పంటలకు సాగునీరు అందుతుంది.