
రేపటి నుంచి అంతారంలో నాలుగు రోజుల పాటు జరుగనున్న పాండురంగ ఉత్సవాలు
మునిపల్లి, నవంబర్ 27 : రాష్ట్రంలోనే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన జీవన్ముక్త పాండురంగ మహారాజ్ ఉత్సవాలు ప్రతి ఏడు నిర్వహించే విధంగా ఈ ఏడాది కూడా ఉత్సవాలకు జీవన్ముక్త పాండురంగ ఆలయం ప్రత్యేకంగా ముస్తాబవుతున్నది. మండల పరిధిలోని అంతారంలో 365 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏటా కార్తిక బహుళ దశమి నుంచి బహుళ చతుర్థశి వరకు జీవన్ముక్త పాండురంగ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాలు ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు.
ఇతర రాష్ర్టాల భక్తులు అధికం..
అంతారంలో నాలుగు రోజుల పాటు నిర్వహించే జీవన్ముక్త పాండురంగ ఉత్సవాలల్లో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
జాతీయ రహదారికి 5 కిలోమీటర్ల దూరం..
జీవన్ముక్త పాండురంగ మహారాజ్ ఆలయం మునిపల్లి మండలం అంతారంలో ఉన్నది. ముంబై జాతీయ రహదారి కంకోలో గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అంతారం గ్రామం ఉన్నది. గ్రామానికి వెళ్లేందుకు ఆటోలు, ఆర్టీసీ బస్సులతో మెరుగైన రవాణా సౌకర్యం ఉన్నది. అందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు ముందుగా ఈ ఆలయం వద్దకు జీవన్ముక్త పాండురంగ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలు..
29న (సోమవారం) ఆలయంలో శిఖరస్థాపన
30 (మంగళవారం) గరుడవాహనం, కీర్తనలు ఆలపించడం
1 డిసెంబర్ (బుధవారం) మహాపూజ, పుష్పార్చన, ప్రత్యేక భజన కార్యక్రమాలు
2 డిసెంబర్ (గురువారం) ఉదయం పూజలు, రాత్రి సమయంలో రథోత్సవం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది.