అనారోగ్యంతో తొలి అర్జున అవార్డు గ్రహీత కన్నుమూత
ఆరు రోజుల క్రితమే 104వ పుట్టిన రోజు వేడుకలు
అంచెలంచెలుగా ఎదిగిన క్రీడా దిగ్గజం
విషాదంలో ఓరుగల్లు క్రీడాలోకం
కృష్ణా జిల్లాలో మొదలై ఓరుగల్లులో ముగిసిన ప్రస్థానం
పిచ్చయ్య మృతి క్రీడారంగానికి తీరని లోటు : మంత్రి ఎర్రబెల్లి
సంతాపం తెలిపిన్ర పజాప్రతినిధులు, క్రీడా సంఘాల బాధ్యులు
పోచమ్మమైదాన్, డిసెంబర్ 26;తొలితరం ఆటగాడు, బాల్ బ్యాడ్మింటన్‌లో అర్జున అవార్డు తొలి గ్రహీత జమ్మల మడుగు పిచ్చయ్య ఇక లేరు. ఆరు రోజుల క్రితమే 104వ పుట్టిన రోజును కుటుంబ సభ్యుల నడుమ ఘనంగా జరుపుకొన్న ఆయన ఆదివారం మధ్యాహ్నం హనుమకొండ జిల్లా కరుణాపురంలో అనారోగ్యంతో కన్నుమూశారు. తనకంటూ గురువు, శిక్షణ లేకుండానే ఏకలవ్యుడిలా ఆటలో పట్టుసాధించి అంచెలంచెలుగా ఎదిగి దేశానికే వన్నె తెచ్చారు. తొలితరం క్రీడాకారుడిగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన క్రీడా దిగ్గజం దూరమవడం ఓరుగల్లుతోపాటు క్రీడాలోకం విషాదంలో మునిగింది. ఆయన మృతి క్రీడారంగానికి లోటు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల బాధ్యులు సంతాపం తెలిపారు.
వరంగల్ జిల్లాకు చెందిన పిచ్చయ్యది స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం. 1918 డిసెంబర్ 21న పున్నయ్య, నాగమ్మ దంపతులకు మూడో కుమారుడిగా ఆయన జన్మించారు. తండ్రి మచిలీపట్నంలో స్థిరపడడంతో అక్కడే ఎస్ఎస్ఎల్సీ పూర్తిచేశారు. అయితే పదో తరగతిలో ఉత్తీర్ణత కాకపోవడంతో స్థానికంగా ఉన్న మినర్వ క్లబ్, మోహన క్లబ్ బాల్ బ్యాడ్మింటన్‌గా ఆడడం నేర్చుకున్నాడు. అప్పట్లో ఆ ఆటను ఉన్నతవర్గాలకు చెందిన వారే ఆడేవారట. అయినా ఈ ఆటను ఎలాగైన నేర్చుకోవాలనే కసి, పట్టుదల పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆయన బ్యాడ్మింటన్ క్రీడల్లో నైపుణ్యం సంపాదించుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణించారు. ఆటలో తనకంటూ ప్రత్యేకమైన గురువు, శిక్షణ లేకపోయినా ఏకలవ్యుడిలా సాధన చేసుకుని పట్టు సాధించారు. పిచ్చయ్య క్రీడా ప్రతిభను చూసిన కొన్ని ప్రైవేట్ క్లబ్‌ల నిర్వాహకులు తమ తరపున ఆడాలని ప్రోత్సహించారు. 1935లో నర్సరావుపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. వివాహం అయిన తర్వాత ఉద్యోగం కోసం కొన్నాళ్లు ఆటకు విరామం ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ పునరాగమనం చేశారు. 1947లో గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభను నిరూపించుకున్నారు.
రూ.50 వేతనంతో అజంజాహి మిల్లులో ఉద్యోగం..
హైదరాబాద్‌కు చేరుకున్న పిచ్చయ్య కుటుంబ సభ్యులు 1945వ సంవత్సరంలో ఉద్యోగాన్వేషణలో పడ్డారు. క్రీడలతో ఉద్యోగం ఉంటే కుటుంబం పరిస్థితులు చక్కదిద్దుకోవచ్చనే ఆలోచనతో ఓరుగల్లుకు చేరుకున్నారు. ఇక్కడ ఉన్న అజంజాహి వర్కర్స్ యూనియన్లను కలిసి నెలకు రూ.50 వేతనంతో ఉద్యోగం సంపాదించారు.
1970లో అర్జున అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వం..
బ్యాడ్మింటన్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన పిచ్చయ్యను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 1970లో తొలి అర్జున అవార్డును ప్రకటించింది. అయితే 1971లో పాకిస్తాన్‌తో ఇండియా యుద్ధం కారణంగా ఆ ఏడాది అవార్డు అందుకోలేకపోయారు. చివరకు 1972లో అప్పటి రాష్ట్రపతి వీవీగిరి చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డును స్వీకరించారు.
వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు..
1950 సంవత్సరంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పోటీల్లో పాల్గొనలేకపోయారు. అయినా 1954లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత 1956, 1957 సంవత్సరంలో మద్రాస్, పాండిచ్చేరిలో జరిగిన జాతీయ పోటీల్లో కెప్టెన్‌గా ఉంటూ జట్టును గెలిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటకతో పాటు ఇతర రాష్ర్టాల్లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని తొమ్మిది చాంపియన్‌షిప్‌లను గెలిపించారు.
ఇటీవలే 104వ పుట్టిన రోజు
ఇటీవల ఆయన 104వ జయంతి వేడుకలను కుటుంబసభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణంలో జరుపుకొన్నారు. రెండు, మూడు రోజుల నుంచి అనారోగ్యానికి గురై కరుణాపురంలో చిన్న కుమార్తె జానకీదేవి కుమారుడు(మనవడు) ప్రశాంత్ ఇంటిలో ఆదివారం కన్నుమూశారు. కాగా పిచ్చయ్య అంత్యక్రియలు సోమవారం ఉదయం 11.30గంటలకు నయీంనగర్ పోచమ్మకుంటలో నిర్వహించనున్నారు.
ఆధ్యాత్మిక చింతనతో జీవితం..
పిచ్చయ్యకు భార్య సత్యవతి, కుమార్తెలు సుశీల, జానకీదేవి ఉన్నారు. అయితే 2007లో భార్య కన్నుమూయడంతో ఆయన ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నారు. ఇప్పటీకీ ఆయన శతాధిక వృద్ధుడు(104) అయినా తన పనులు తానే చేసుకుంటూ ఉత్సాహంగా ఉండేవారు. చిన్నతనంలో నేర్చుకున్న క్రీడలే తనను వందేళ్ల దాటినప్పటికీ వయస్సు పిల్లోడిలా ఉంచుతున్నాయని కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తూ ఛలోక్తులు విసిరేవారట.
క్రీడారంగానికి తీరని లోటు
ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, తొలి అర్జున్ అవార్డు గ్రహీత పిచ్చయ్య మృతి తీరని లోటని రాష్ట్ర పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం సంతాపం ప్రకటించారు. ఆయన అకాల మరణం క్రీడారంగాన్ని విషాదంలో ముంచిందని పేర్కొన్నారు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్రం నుంచి ఎందరో క్రీడాకారులను జాతీయ, రాష్ట్రస్థాయికి తీసుకొచ్చారని కొనియాడారు. ఈ నెల 21న 104వ పుట్టిన రోజులు వేడుకలను సంతోషంగా జరుపుకున్నారని గుర్తు చేశారు. పిచ్చయ్య మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.