
ఖమ్మం, నవంబర్ 23: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ మంగళవారం మరో మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఖమ్మంలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ కోలాహలం కనిపించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఆ తరువాత ఎమ్మెల్యేలు సండ్ర వెంటకవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు ఆధ్వర్యంలో తాతా మధు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు.
తాతా మధును గెలిపించాలి: అజయ్
ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధును ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి ఆ విజయాన్ని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. నామినేషన్ పత్రాలు దాఖలుకు ముందు టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, వారు లేని చోట పార్టీ ఇన్చార్జులు బాధ్యత తీసుకొని సభ్యులను క్యాంపునకు తీసుకెళ్లాలని సూచించారు. దాదాపు 600 మంది సభ్యులు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ప్రతి ఓటరూ క్యాంపునకు తీసుకురావాలని స్పష్టం చేశారు. ఓటు ఏ విధంగా వేయాలి, ఓటింగ్‌లో పాల్గొనే విధానం ఏంటి అనే విషయాలను తెలుసుకోవచ్చన్నారు.
కేసీఆర్‌కు కృతజ్ఞతలు: తాతా మధు
అనంతరం అభ్యర్థి తాతా మధు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, యువనేత కేటీఆర్ ఆశీస్సులతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సహకారంతో తాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యానన్నారు. తనను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. పార్టీ అధినాయకత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నాకనే తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, రాములు నాయక్, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, కేఎంసీ మేయర్ నీరజ, టీఆర్ఎస్ నేత ఆర్జేసీ కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, పలు మున్సిపాలీటీల చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాల్గొన్నారు.