ఆకాశన్నంటుతున్న కూరగాయల ధరలు
రోజురోజుకూ పెరుగుతుండడంతో కొనలేని స్థితి
టమాట కిలో రూ.100, ఇతర కూరగాయలు రూ.80కిపైనే..
రైతులకు దక్కని మద్దతు ధర
నియంత్రించాలని కోరుతున్న ప్రజలు
గద్వాల, నవంబర్ 21: టమాట ధర పైపైకి వెళ్తున్నది. మార్కెట్లో కిలో ధర రూ.100. బెండకాయ బెంబేలెత్తిస్తుండగా.. క్యాప్సికం, క్యారెట్, కాలిఫ్లవర్ కంగారెత్తిస్తున్నాయి. ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుండగా.. మిర్చి ఘాటెక్కిస్తున్నది. ఇలా ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతుండడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఏ కూరగాయ చూసినా మినిమం ధర రూ.60కిపైగానే.. అయినా మద్దతు ధర అందడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉండగా.. మరోవైపు కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో ప్రజలకు కూరగాయల ఘాటు తగలడంతో అటువైపు వెళ్లడానికే భయపడుతున్నారు. కూరగాయల ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఏడాది మన ప్రాంతంలో కూరగాయలు సాగు అంతంత మాత్రమే ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు ఇక్కడికి తెచ్చుకోవడంతో ధరలు ఒకేసారి అమాంతగా పెరిగాయి. కడప, చిత్తూరు, మదనపల్లి తదితర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురువడం, అక్కడినుంచి మనకు వచ్చే కూరగాయలు రాకపోవడంతో మార్కెట్లో కూరగాయలకు కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్నంటాయి. మార్కెట్లో ఏ కూరగాయ కొనాలన్న కిలో రూ.60పైనే ఉండడంతో సమాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ మేరకు దృష్టి సారించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దీనికితోడు ఉద్యానవశాఖ అధికారులు రైతులకు కూరగాయలు సాగుపై అవగాహన కల్పించకపోవడంతో రైతులు ఇతర పంటలు వేయడం వల్ల మన ప్రాంతంలో కూరగాయలు సాగు అంతంత మాత్రమే ఉంది.
సెప్టెంబర్లో టమాట కిలో రూ.10 ఉండగా ఇప్పుడు పదింతలు పెరిగింది. వంకాయ, కాలిఫ్లవర్, క్యాప్సికం, బీరకాయ, క్యారెట్ తదితర కూరగాయలు రూ.40 ఉండగా ప్రస్తుతం అవి రూ.80లకు విక్రయిస్తున్నారు. ఆదివారం మార్కెట్లో టమాట బాక్స్ ధర రూ.1900 పలికింది. గతేడాది ఈ నెలలో టమాటకు ధరలు లేక రైతులు రోడ్లపై పారబోశారు. మార్కెట్లో ఎప్పుడైతే టమాట ధర పెరుగుతుందో ఇతర కూరగాయల ధరలు వాటితోపాటు పెరుగుతున్నాయి. బయట మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్నా పండించిన రైతులకు మాత్రం ఆ దిశగా ధరలు లేక మార్కెట్లో దళారులకు ధర వచ్చిన కాడికి అమ్ముతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర సరుకుల నుంచి ఉల్లి తదితర ధరలు పెరిగి పోయాయి. మార్కెట్లో టమాట ధరలు చూస్తుంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కూరగాయలకు పావలా వంతు వెచ్చించాల్సి వస్తుందని కూలీలు వాపోతున్నారు. పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచి అందరికి అందుబాటులో కూరగాయల ధరలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.