కొడంగల్, నవంబర్ 20 : కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కోరారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలకు రూ.15కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయని, మరిన్ని నిధులు మంజూరు చేసి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్ పట్టణంలో అధునాతన, అన్ని హంగులతో కూడిన 50 పడకల దవాఖాన భవన నిర్మాణం త్వరలో పూర్తి కానుందని, దౌల్తాబాద్ మండలంలో మినీ ట్యాంక్‌బండ్ వంటి అభివృద్ధి పనులు చాలా వరకు చివరి దశకు చేరుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల్లో సీసీ, డ్రైనేజీ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. రెండు మున్సిపాలిటీలకు రూ.10కోట్ల చొప్పున మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వినతిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు చర్యలు తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ బాల్‌సింగ్‌నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, సర్పంచ్ పకీరప్ప ఉన్నారు.