గత సంవత్సరం యాసంగిలో 3,200 ఎకరాల్లో సాగు
రాష్ట్రంలోనే అత్యధికంగా పంట దిగుబడి
మంచి లాభాలు ఆర్జించిన రైతులు
ఈ ఏడాదీ అదే పద్ధతి.. 5,600 ఎకరాలకు పెరిగిన సాగు
అక్కడ ఎటు చూసినా కొండ ప్రాంతాలే.. సాగునీటి కాల్వలు లేవు.. చెరువులు, కుంటలు అంతంత మాత్రమే.. పంటలకు భూగర్భ జలాలే దిక్కు.. నీటిని పొదుపుగా వాడుకుంటూ పల్లిని బంగారంగా పండిస్తున్నారు చందంపేట, నేరేడుగొమ్ము మండలాల రైతులు.. వానకాలంలో పత్తి, యాసంగిలో వేరుశనగ వేస్తూ మంచి దిగుబడుగులు సాధిస్తున్నారు. నాలుగైదు ఏండ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. అంతకుముందు బోర్ల ద్వారా తిండి మందం వరి పండించుకునే రైతులు సర్కారు 24 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు ఆరుతడి పంటలకు ప్రోత్సాహం కల్పిస్తుండడంతో రైతులంతా పత్తి ఆ తర్వాత పల్లి సాగు చేస్తున్నారు. గతేడాది ఈ రెండు మండలాల్లో 3200 ఎకరాల్లో వేరుశనగ సాగు చేయగా ఈ ఏడాది 5,600 ఎకరాలకు పెరిగింది. గత సంవత్సరం రాష్ట్రంలోనే అత్యధిక పల్లి దిగుబడి సాధించిన మండలంగా చందంపేట రికార్డుకెక్కింది. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ప్రభుత్వం సూచిస్తుండడంతో ఆ దిశగా మండల రైతులు కదులుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరువుకు కేరాఫ్ ప్రాంతమైన చందంపేట మండలంలో నేడు సిరులు పండుతున్నాయి. ప్రభుత్వం సాగు నీటి వసతి కల్పించడంతో పాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తుండడంతో బోర్లు దంచికొడుతున్నాయి. దాంతో రైతులు వానకాలంలో పత్తి, యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. గతంలో తిండి గింజల కోసం కొద్ది మొత్తంలో వరి పండించి మిగతా భూమిని పడావు పెట్టిన రైతులంతా నేడు ప్రత్యామ్నాయ పంటల సాగులో బిజీగా మారిపోయారు.
పల్లి సాగుకు సన్నద్ధం..
చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లో బోర్ల కింద వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. అక్కడక్కడ మిర్చి, ఎక్కువ మొత్తంలో వేరుశనగ సాగవుతున్నది. గతేడాది పల్లికి భారీగా డిమాండ్ ఉండడంతో ఈ సారీ ఉమ్మడి మండలంలో 5వేల ఎకరాల్లో పల్లి సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారని వ్యవసాయాధికారులు తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోనే పల్లిని అధికంగా పండిస్తున్న ఘనత చందంపేట, నేరెడుగొమ్ము మండలాల రైతులకు దక్కింది. గత సంవత్సరం ఉమ్మడి మండలంలో 3,200 ఎకరాల్లో 38,400 క్వింటాళ్ల పల్లి పండించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంట మార్పిడి చేయాలని రైతులకు అవగాహన కల్పించడంతో వానకాలంలో పత్తి సాగు చేసిన రైతులు రెండో పంటగా పల్లి సాగుకు మొగ్గు చూపుతున్నారు. 2020 సంవత్సరంలో 3,200 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. 2021లో ఉమ్మడి మండలంలోని 5,600 ఎకరాల్లో పల్లి సాగు చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు వ్యవసాయాధికారులు వెల్లడించారు. చందంపేట మండలంలోని చిత్రియాల, పెద్దమూల, రేకులగడ్డ, కంబాలపల్లి, తెల్దేవర్పల్లి, ముడుదండ్ల, కోరుట్ల, మరుపునూతల, పోలేపల్లి, గాగిళ్లాపురం, కాట్రావత్ తండా, గుంటుపల్లి, గన్నెర్లపల్లి గ్రామాలతో పాటు నేరెడుగొమ్ము మండలంలోని కాచరాజుపల్లి, సుద్దబావి తండా, బచ్చాపురం, బుగ్గతండా, చిన్నమునిగల్, పెద్దమునిగల్, కొత్తపల్లి, గుర్రపుతండా, నేరెడుగొమ్ము, తిమ్మాపురం, మోసమ్గడ్డ తండాలకు చెందిన రైతులు పత్తి పండించిన తర్వాత వేరుశనగ వేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో విత్తనాలు ఇప్పటికే మొలకెత్తాయి. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో వారానికి ఓ సారి పంటకు నీరందిస్తున్నారు. దీంతో 4 నెలల్లో పంట చేతికందుతుందని రైతులు పేర్కొంటున్నారు. గతంలో క్వింటా పల్లి ధర రూ.6 వేల నుంచి 6,800 వరకు ధర పలికింది.
ప్రత్యామ్నాయ పంట మార్పిడితోనే పల్లి సాగు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ తరుణంలో రైతులు పత్తి సాగు చేసిన అనంతరం రెండో పంటగా వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. మూడేండ్ల కిందట 500-600 ఎకరాలకే పరిమితమైన వేరుశనగ సాగు నేడు 5, 600ఎకరాలకు చేరడం గమనార్హం. ఎకరంలో సు మారు 10 – 12 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నదని, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ లేవని రైతులు పేర్కొంటున్నారు.
రైతులకు ఎంతో మేలు…
వానకాలంలో 4 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొత్తం అమ్మితే రూ.3.20లక్షలు వచ్చినయి. గత సంవత్సరం 3 ఎకరాల్లో పల్లి సాగు చేశాను. 36 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ. 2.40 లక్షలు లాభం వచ్చింది. ఒకే సంవత్సరంలో రూ. 5.60లక్షల ఆదాయం చేతికొచ్చింది. ఈ సారి రెండో పంటగా మళ్లీ సాగు చేసేందుకు పొలాన్ని సిద్ధం చేశాను. గత సంవత్సరం మార్కెట్లో పల్లికాయలకు డిమాండ్ ఉండటంతో మంచి లాభం వచ్చింది.