సహకార’ వారోత్సవాలు షురూ
ఆలేరు టౌన్, నవంబర్ 14 : రైతుల సేవే పరమావధిగా పని చేస్తున్న పీఏసీఎస్‌లు ప్రగతి బాటలో పయనిస్తున్నాయి. రైతులకు ప్రభుత్వం చేయూతను ఇవ్వాలనే ఆలోచనతో స్వాతంత్య్రానికి ముందే సహకార వ్యవస్థ అందుబాటులోకి తెచ్చింది. రైతులు సభ్యులుగా చేరి అవసరాలు తీర్చికుంటూ ఆర్థిక ఉన్నతికి బాటలు వేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14 నుంచి 20 వరకు సహకార వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొత్త రుణాల మంజూరు, రికవరీ విషయాలు చర్చిస్తారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 107 పీఏసీఎస్‌లు ఉండగా, వీటిల్లో లక్షా 67 వేల మంది సభ్యులు ఉన్నారు.
లాభాపేక్ష లేకుండా సేవలు
పీఏసీఎస్ ఆత్మనిర్భర్ పథకం కింద నాబార్డు రూపాయి వడ్డీకి రుణాలు మంజూరు చేస్తున్నది. ఎలాంటి లాభపేక్ష లేకుండా అన్నదాతలకు సేవలు అందిస్తున్నాయి. పాడి పరిశ్రమ, మహిళా సంఘాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తన విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లు ఈ సంఘాల ద్వారానే జరుగుతున్నాయి. స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాయి. వానకాలం, యాసంగి సీజన్ ప్రారంభంలో రుణాలు ఇచ్చి పంట చేతికి అందిన తరువాత రుణాలు వసూలు చేసుకుంటున్నాయి. భూములను తనఖా పెట్టుకొని సంఘం సభ్యులకు విదేశీ విద్య కోసం, డెయిరీ ఏర్పాటు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం, బోరు మోటర్ల ఏర్పాటు, ట్రాక్టర్ల కొనుగోలు రుణాలు మంజూరు చేస్తున్నాయి.
సహకార సంఘాలకు అండగా ప్రభుత్వం
సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉం ది. గతంలో ఏ ప్రభుత్వాలూ ఇవ్వని విధంగా రైతులకు రుణాలు అందిస్తున్నాం. పీఏసీఎస్‌ల బలోపేతానికి కృషి చేస్తున్నాం. పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. దీని వల్ల సంఘంలో సభ్యులుగా ఉన్న రైతులతో పాటు మిగిలిన వారికి కూడా మద్దతు ధర దక్కుతుంది. రైతులకు బాసటగా నిలుస్తున్నాం.