జాజిరెడ్డిగూడెంలో వృథాగా బాలికల హాస్టల్ బిల్డింగ్
వినియోగంలోకి తేవాలని గ్రామస్తుల వేడుకోలు
అర్వపల్లి, నవంబర్13 : జాజిరెడ్డిగూడెంలోని ఎస్సీ బాలికల హాస్టల్ భవనం కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారింది. 2012సంవత్సరంలో రూ.25లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. కొన్నేళ్లు హాస్టల్ నడిచాక బాలికల సంఖ్య తగ్గడంతో ఎత్తివేశారు. అప్పటి నుంచి ఈ భవనం ఖాళీగా ఉంది. అయితే 2016లో మండలానికి కొత్తగా ఎస్సీ గురుకుల బాలికల పాఠశాల మంజూరైంది. ఖాళీగా ఉన్న ఎస్సీ హాస్టల్ భవనంలోనే ఈ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. గురుకుల పాఠశాల నిర్వహణ కోసం రూ.6లక్షలతో భవనాన్ని మరమ్మతు చేయించి అన్ని వసతులు కల్పించి వినియోగంలోకి తెచ్చారు. ఏడాది నడిచాక ఈ భవనం బాలికలకు సరిపోవడం లేదనే సాకుతో ఇక్కడి నుంచి గురుకుల పాఠశాలను సూర్యాపేటకు తరలించారు. అప్పటి నుంచి ఈ భవనం వృథాగా ఉంటున్నది.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..
ఖాళీగా ఉన్న ఈ భవనంలో కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనంలో 8గదులతోపాటు మరో 8 మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించారు. విశాలమైన ఆట స్థలం ఉంది. ప్రస్తుతం భవనం నిర్వహణ లేక పిచ్చిమొక్కలు, కంపచెట్లతో నిండిపోయింది. దీంతో దేవాలయంలాంటి భవనం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. గ్రామపంచాయతీ భవనం పూర్తిగా శిథిలమై కూలే దశకు చేరింది. తాత్కాలికంగా ఈ భవనాన్ని గ్రామపంచాయతీ కార్యాలయానికి ఉపయోగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.