జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్
దేవరకొండ, నవంబర్ 13 : ప్రజలకు చట్టాలపై కనీస అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు ఎంవీ రమేశ్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ ధర్మం, న్యాయం, జ్ఞానం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అధిక శాతం నేరాలు క్షణికావేశంలో జరుగుతున్నాయని, వాటి నియంత్రణకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉచిత న్యాయ సేవల కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని చెప్పారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉంటాయని, లబ్ధి కలుగుతుందని అన్నారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ చట్టాలపై అవగాహన పెంపొందించుకొని ఇతరులుకు వివరించాలని సూచించారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వేణు మాట్లాడుతూ చట్టాలపై అవగాహనతోనే సత్వర న్యాయం జరుగుతుందని వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలోని 30 శాఖల అధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, సెషన్స్ జడ్జి నాగరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ఆంజనేయులు, డీఎంహెచ్ఓ కొండల్రావు, ఆర్డీఓ గోపీరాం, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల గ్రూపులకు చెక్కులను అందించారు.