నీలగిరి, నవంబర్ 13 : స్థానిక సమస్యల పరిష్కారం దిశగా నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అధ్యతన శనివారం జరిగిన ఈ సభలో జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పలువురు అధికారుల తీరును సభ్యులు ప్రశ్నించి.. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సలహాలతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. వచ్చే సమావేశానికి ఉన్నతాధికారులు హాజరు కావాలని, అవసరమైతే సమావేశం రెండు రోజులపాటు నిర్వహించి అన్ని శాఖల ప్రగతిని సమీక్షించాలని సభ్యులు సూచించారు. ముందుగా ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ, సహకారశాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి సమస్యను పరిష్కరించాలని కోరారు. తుఫాన్ ముంచుకొస్తున్నందున వరి తేమశాతం పెరిగి రైతులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉన్నదని సభ దృష్టికి తీసుకొచ్చారు. లోడింగ్, అన్లోడింగ్ వెంటనే చేపట్టాలని చండూర్ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం కోరారు. కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కోరారు.
విద్యాశాఖ అధికకారులపై గరం…
మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు నిధులు వచ్చి రెండు నెలలు కావస్తున్నా ఎందుకు చెల్లించడం లేదని తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరువస్తుందని అన్నారు. ఇతర జిల్లాల్లో స్కావెంజర్లకు రూ.2500 ఇస్తున్నారని, కానీ ఇక్కడ విద్యా శాఖ అధికారులు కనీసం కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దవూర మండలంలో విద్యార్థులకు దుస్తులు ఇవ్వకుండానే లక్షల రూపాయలు చెల్లించినట్లు రికార్డులు తయారు చేశారని జడ్పీటీసీ సభ్యురాలు నిలదీశారు. అనంతరం ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిని సభ్యులు సన్మానించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ సభ్యులు పాశం సురేందర్‌రెడ్డి, సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, నారబోయిన స్వరూపారాణి, అంగోతు భగవాన్ నాయక్, అరుణ పాల్గొన్నారు.