సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ఓ వైపు చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. మరోవైపు సంక్రాంతి సంబురాల్లో జనం నిమగ్నమయ్యారు. దుకాణాలన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి
పరిస్థితుల్లో కరోనా కట్టడికి స్వీయ రక్షణ చర్యలే బ్రహ్మాస్ర్తాలు. మన చుట్టూనే వైరస్ వాహకాలు ఉన్నాయన్న విషయం మరువొద్దని హెచ్చరిస్తున్నారు. ఉపయోగించే వస్తువులు, తాకే ప్రదేశాలు ఎంత వరకు పరిశుభ్రంగా ఉన్నాయో పరిశీలించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా రిస్క్ నుంచి బయటపడటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
షాపింగ్‌లో జరభ్రదం
షాపింగ్ చేయడానికి మాల్స్‌కు వెళుతుంటారు. దుస్తులు, పర్సులు, బ్యాగులు, కండ్లజోడు, షూస్, మొబైల్స్, గడియారం, జ్యువెల్లరీ, స్మార్ట్ వాచెస్ తదితర యాక్ససరీలపై కూడా వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. వాటిని వినియోగదారులు పరిశీలించే సందర్భంలో వైరస్ చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ముట్టుకోకుండానే కొనుగోలు చేయడం మంచిది. ఏ వస్తువు కొనుగోలు చేయాలని భావిస్తామో దానికే పరిమితమై షాపింగ్ ముగించడం ఉత్తమం. అనవసరంగా అనేక వస్తువులను చూస్తూ.. తాకుతూ ఉండటం వల్ల వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది.
ప్రజారవాణాలో పైలం
సంక్రాంతి నేపథ్యంలో ప్రజా రవాణా పెరిగింది. ట్రావెల్స్, ఆటోలు, ట్యాక్సీలు, రైళ్లు, బస్సులు పెద్ద ఎత్తున ప్రయాణికులను గమ్యం చేరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. కూర్చొనే సీట్లు, మోచేతులు పెట్టుకోవడానికి వీలుగా ఉన్న ఆర్మ్ రెస్ట్స్, మెట్లు ఎక్కేటప్పుడు చేతులతో పట్టుకునే హ్యాండ్రాయిల్స్ తదితర వాటితో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. చాలా మంది వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుండటం ప్రమాదకరం. టాయిలెట్ తలుపులు, టాయిలెట్ సీటు, ఫ్లషింగ్ బటన్, టాయిలెట్ పేపర్, టవల్స్ తదితర సామగ్రితో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఏ వస్తువును తాకినా చేతులను పరిశుభ్రం చేసుకోకుండా కండ్లు, ముక్కు, నోరును ముట్టుకోకూడదు. శానిటైజర్‌ను వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దు.
పతంగికో పేరు..మాంజాకో రంగు
గుడ్ల పతంగి (పతంగిపై గుడ్డు ఆకారంలో పేపర్), నామాల పతంగి (బద్ద మధ్యలో యు ఆకారం ఉండటం), చందమామ పతంగి, ఆది రోటీ (రెండు రంగుల్లో ఉండే పతంగి), డోరేదార్ పతంగి (పతంగి చివర్లో దారాలు ఉంటాయి), పర్ని (కవర్) పతంగులు.. ఇలా ఇంకా ఎన్నో పతంగుల పేర్లు వినిపిస్తుంటాయి. మరోవైపు, గాజరీ (ఆరెంజ్ కలర్), గంధక్ (గంధం కలర్), మిలిటరీ మాంజా ( డార్క్ కలర్), అంగూరీ మాంజా (గ్రేప్స్ కలర్), అండేకా మాంజా (తెలుపు రంగు), పీలా మాంజా (పచ్చని రంగు), లాల్ మాంజా (ఎర్రని రంగు), టంగూస్, కర్కరా మాంజాల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. వీటితోపాటు మాంజా సుతాంచుడు అనే పదం వినిపిస్తుంది. అంటే అన్నం మెత్తగా తయారుచేసి.. రంగులు, ఇతర సన్నని సీసం ముక్కలతో దారానికి అద్దడాన్ని సుతాంచుడు అని అంటారు.