సీఎం కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా టీఆర్ఎస్ నూతన కమిటీలు
గ్రామాల్లో ఎన్నికలు పూర్తి
పట్టణ, వార్డు కమిటీల కార్యవర్గాల కోసం నేతల సమావేశాలు
జనగామ, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమ పార్టీగా అవతరించి లక్ష్యాన్ని సాధించిన టీఆర్ఎస్ ఇంటిపార్టీగా గెలిచి నిలిచింది. పల్లెలు, పట్టణాల్లో వాడవాడలా బలమైన పునాదుల్ని కలిగిన గులాబీ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తున్నది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఆదేశాలతో సెప్టెంబర్‌లో గ్రామ, మండల, జిల్లా కమిటీలను, వార్డు, పట్టణ కమిటీలను ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు జెండా పండుగతో పల్లెల్లో మొదలైన సంస్థాగత సందడి పట్టణాల్లోనూ నెలకొంది. జిల్లాలోని 12 మండలాల్లో 281 గ్రామాలుండగా, జనగామ మున్సిపల్ పరిధిలో 30 వార్డులున్నాయి. పార్టీ సభ్యత్వం లక్షా 70 వేలు చేరింది. సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ, వార్డు, పట్టణ కమిటీలకు నిర్వహిస్తున్న ఎన్నికలు నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. వచ్చే నెలలో వివిధ కమిటీల్లో మార్పులు, చేర్పులు, నూతన కార్యవర్గాల కూర్పు ఉంటాయనే సంకేతాలతో కార్యకర్తల్లో హుషారు కనిపిస్తున్నది. గతంలో టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించిన జిల్లా సమన్వయకర్తల విధానాన్ని తిరిగి తీసుకురావడం సహా జిల్లా పార్టీ సారథ్యబాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేవారినే జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
త్వరలోనే నామినేటెడ్ పదవుల నియామకం ఉందనే సంకేతాల నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అనుబంధ కమిటీలతోపాటు గ్రామ, మండల స్థాయి పార్టీ సోషల్ మీడియా కమిటీల ఏర్పాటు సహా అన్ని కమిటీల్లోనూ మహిళా కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఈనెల 2 నుంచి 12 వరకు అన్ని గ్రామ పంచాయతీలు, వార్డు కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశారు. 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీలు ఏర్పాటు, ఈ నెల 20న జిల్లా కార్యవర్గాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక నిర్వహించనున్న నేపధ్యంలో ఈసారి పార్టీ పదవులు దక్కుతాయనే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా చేపట్టిన అన్ని రకాల పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల్లో 51 శాతం ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా రిజర్వేషన్లు పాటిస్తూ కమిటీలు నియమించడంతో ఆయా వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది.
జనగామలో వార్డు కమిటీ ఎన్నిక..
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డి ఆదేశాలతో జనగామ పట్టణంలోని 21వ వార్డులో పార్టీతోపాటు యువజన, విద్యార్థి విభాగాలు, అనుబంధ కమిటీలు, బీసీ, మహిళా కమిటీలను ఆదివారం వార్డు కమిటీ ఇన్‌ఛార్జి కర్రె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. వార్డు అధ్యక్షుడిగా మంగ రామకృష్ణ, యూత్ అధ్యక్షుడిగా తోటకూరి మహేందర్, బీసీ సెల్ అధ్యక్షుడిగా మజ్జిగ యాదగిరి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కర్రె కృష్ణ, కానుగంటి ముత్తయ్య, మామిడాల రాజు, రామేశ్వరచారి, చిర్ర బీరయ్య, కర్రె సిద్ధులు, వెంకటేశ్, ఉల్లెంగుల సందీప్, జాయ శ్రీశైలం, రాజబోయిన శ్రీశైలం పాల్గొన్నారు.