స్టేషన్ ఘన్పూర్/రఘునాథపల్లి, నవంబర్ 10 : రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం విశ్వనాధపురం, రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో ఓడీసీఎంఎస్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. శివునిపల్లిలో స్టేషన్‌ఘన్‌పూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో ఇప్పటికే ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో మరో కేంద్రం ప్రారంభించామన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాజయ్య తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రం ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే 6,897 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. రైతులు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తున్నదన్నారు. సమైక్య పాలనలో సాగునీటి సమస్య తీవ్రంగగా ఉండేదని, పండించిన కొద్ది పాటి పంటలకు సైతం మద్దతు ధర లభించకుండా అడ్డుకునేవారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ దళారుల సమస్యను నియంత్రించారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960, సాధారణ రకానికి రూ.1940 ధర చెల్లిస్తున్నారని ఆయన వివరింరారు.
రైతును రాజు చేయడమే ధ్యేయం
వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్న సీఎం కేసీఆర్ రైతును రాజు చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. రైతుబంధు పథకంలో ఎకరానికి ఏడాదిలో రూ.10 వేలు ఇస్తున్నారని, రైతుభీమాతో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిస్తున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడంతోపాటు లక్షలాది ఎకరా బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాని వివరించారు. దేవాదుల రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపుతున్నారని, చెరువులకు సైతం నీరందిస్తుండడడంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో బోర్ల ద్వారా సైతం రైతులు పెద్ద సంఖ్యలో సాగు చేస్తున్నారని రాజయ్య వివరించారు.
బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొనాలి
దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నందున తెలంగాణలోని బీజేపీ నాయకులు ఈ నెల 12న టీఆర్ఎస్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఆందోళనల్లో పాల్గొనాలని రాజయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనుముల మల్లేశం, ఓడీసీఎంఎస్ ఇన్చార్జి ఐత సంతోశ్, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి మినుకూరి జితేందర్‌రెడ్డి, జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, కూడా డైరెక్టర్ ఆకుల కుమార్, ఎంపీపీ కందుల రేఖా గట్టయ్య, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, శివునిపల్లి గ్రామ ప్రత్యేకాధికారి , ఎంపీడీవో కుమారస్వామి, ఏఈవో ఉషశ్రీ, డైరెక్టర్ చిగురు సరిత, పీఏసీఎస్ డైరెక్టర్ తోట సత్యం, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గుర్రపు నర్సింహ, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వాతిరెడ్డి, మారపెల్లి ప్రసాద్, గుండె మల్లేశ్, ఆకారపు అశోక్ పాల్గొన్నారు. కంచనపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ రఘునాథపల్లి మండల అద్యక్షుడు వారాల రమేశ్‌యాదవ్, నియోజక వర్గ ఇన్చార్జి మడ్లపల్లి సునీత, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అద్యక్షురాలు తిప్పారపు మమత, టీఆర్ఎస్ మండల కార్యదర్శి ముసిపట్ల విజయ్, నియోజక వర్గ ప్రచార కార్యదర్శి తాటికొండ వెంకటేష్‌యాదవ్, సర్పంచ్ గవ్వాని విజయ నాగేశ్వర్రావు, ఎంపీటీసీ కెమిడి రమ్య రా జు, జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ నామాల బుచ్చయ్య, మూడు ధర్మ, బండి కుమార్, తిప్పారపు బాబురావు, గొరిగె రవి పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
రఘునాథపల్లి మండలం భాంజీపేటకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు కన్నా కనకయ్య ఇటీవల మృతి చెందగా కుటుంబసభ్యులను ఎమ్మెల్యే రాజయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. గబ్బెటకు చెందిన తోడేటి చంద్రయ్య, గోవర్దనగిరికి చెందిన దొనికెల బుచ్చమ్మ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సైతం పరామర్శించారు.