
భద్రాచలం/ పర్ణశాల, జనవరి 10: ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం భద్రగిరీశుడు బలరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు అర్చకులు ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి, సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం, తదితర నిత్య పూజలను జరిపారు. అనంతరం ఉత్సవమూర్తిని బలరాముడిగా అందంగా అలంకరించి భక్తుల దర్శనార్థం బేడా మండపంలోనే ఉంచారు. శ్రీహరి శయన తల్పమైన ఆదిశేషుడి అంశతో అవతరించి ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే దానికి ప్రతీకగా నాగలిని ఆయుధంగా ధరించి శ్రీకృష్ణుడికి అన్నగా నిలిచి, ధర్మస్థాపనలో ఆయనకు సహకరించిన అవతారమే బలరామావతారం. సంకర్షణుడిగా పిలువబడే బలరాముడు ప్రలంబాసురుడనే రాక్షసుణ్ని సంహరించాడనేది ప్రతీతి. సాయంత్రం స్వామివారికి దర్బారు సేవ, దివిటీ సలాం, నక్షత్ర హారతి, బంతులాట, వేద స్వస్తి నిర్వహించి తూము నర్సింహాదాసు కీర్తనలు ఆలపించారు. ఆలయ చుట్టు సేవ జరిపి, బంగారు ఊయలలో ఏకాంత సేవ నిర్వహించారు. పర్ణశాలలోనూ స్వామివారు బలరామావతారంలో దర్శనమిచ్చారు.
నేడు శ్రీకృష్ణావతారం..
దేవకీ, వసుదేవలకు అష్టమ సంతానంగా జన్మించి, దుష్టులైన కంసుడు, నరకాసురుడు, శిశుపాలుడు మొదలైన వారిని వధించి, ధర్మవర్తనులైన పాండవుల పక్షం వహించి, కురుక్షేత్ర సంగ్రామంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను అర్జునుడికి బోధించి.. మానవ ఆదర్శాలను, ధర్మాన్ని స్థాపించిన శ్రీమన్నారాయనుడి పరిపూర్ణ అవతారమే శ్రీకృష్ణావతారం. ఈ అవతారాన్ని దర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయన్నది పురాణోక్తి.