కేసీఆర్ కిట్, సర్కారు దవాఖానల్లో ప్రసవాలపై ప్రశంసలు
ప్రజలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది.. ములుగు పర్యాటకంగా అగ్రగామిగా నిలుస్తుంది
రెండు జిల్లాల అభివృద్ధికి కృషిచేయాలి.. నాటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీక రామప్ప
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్.. సేంద్రియ సాగుకు అన్ని విధాలా సహకరిస్తా
నీతి ఆయోగ్ ముఖ్య కార్యదర్శి కె.రాజేశ్వర్‌రావు
ములుగు, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) :ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పేదలకు అందుతున్న విద్య, వైద్యం బాగున్నాయంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ ప్రశంసించారు. బృంద సభ్యులతో కలిసి బుధవారం ఆయన రెండు జిల్లాల్లో పర్యటించారు. మొదట ములుగులో ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.46లక్షలతో నిర్మించిన న్యూట్రీషన్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను ప్రారంభించి, అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న విద్య, పౌష్ఠికాహారాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కలెక్టరేట్లో రెండు జిల్లాల అధికారులతో విద్య, వైద్యం, వ్యవసాయరంగాలపై సమీక్షించి పాలనాపరంగా అధికారుల పనితీరు బాగుందని అభినందించారు. కేసీఆర్ కిట్ పథకంతో గర్భిణులు, బాలింతలకు సేవలు మెరుగుపడి, 94శాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే జరగడంపై వైద్యులకు కితాబునిచ్చారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన ఈ రెండు జిల్లాలు ఎంతో వెనుకబడ్డాయని వాటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప సహా అనేక ప్రత్యేకతలున్న ములుగు జిల్లా పర్యాటకంగా అగ్రగామిగా నిలుస్తుందన్నారు. సేంద్రియ సాగుకు అవసరమైన సహకారం అందిస్తామని ఈమేరకు రెండు జిల్లాలను తాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని నీతి ఆయోగ్ కార్యదర్శి కె.రాజేశ్వర్‌రావు ప్రకటించారు.
సేంద్రియ సాగుకు సహకారం అందిస్తాం
సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన ములుగు, భూపాలపల్లి జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని, ఈ జిల్లాలను ప్రగతి బాట పట్టించేందుకే తాము పర్యటనకు వచ్చినట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ తెలిపారు. రెండు జిల్లాల్లో అధికారుల పాలన, ప్రజలకు అభివృద్ధి పథకాలు అందిస్తున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. పర్యాటకపరంగా ములుగు జిల్లా ప్రత్యేక వసతులను కలిగి ఉందని, భవిష్యత్‌లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలువనున్నదన్నారు. ఆంధ్రా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లో చేపట్టిన రసాయన రహిత వ్యవసాయాన్ని అధ్యయనం చేసి రెండు జిల్లాలోని రైతులను సైతం సేంద్రియ సాగువైపు మళ్లించాలని చెప్పా రు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణతో పాటు మెరుగైన శిక్షణ అందించాలన్నారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచుతూ తల్లిపాల ప్రాముఖ్యతను బాలింతలకు వివరించాలని సూచించారు. విజ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించుకునేందుకు యువతకు అవగాహన కల్పించాలని కోరారు.