సబ్ సెంటర్లు ఇక పల్లె దవాఖానలు
24 గంటలూ గ్రామాల్లో వైద్య సేవలు
మెడికల్ ఆఫీసర్ల పేరుతో ఎంబీబీఎస్ వైద్యుల నియామకం
వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా డయాగ్నొస్టిక్ సెంటర్లు
ములుగు, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) :ప్రజలకు వైద్యసేవలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరోగ్య ఉప కేంద్రాల స్థాయి పెంచుతూ వాటిలో అదనపు వసతులు సమకూర్చుతున్నది. అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నది. బస్తీ దవాఖానలు విజయవంతం కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం కేసీఆర్ ఆదేశాలతో పల్లె దవాఖానలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్యం కోసం 27 పల్లె దవాఖానల్లో కాంట్రాక్టు పద్ధతిన వైద్యుల నియామకం కూడా చేపట్టనున్నారు. ఇందుకు దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 12 వరకు గడువు విదించింది. వీరి ఎంపికతో ఇక రోజూ దవాఖానల్లో ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో ఉండనున్నారు. పట్టణంలో ఉండే అర్బన్, పీహెచ్సీలో అందుబాటులో ఉండే ఉచిత వైద్య సేవలన్నీ ఇక మీదట పల్లె దవాఖానల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా డయాగ్నొస్టిక్ సెంటర్లను అనుసంధానం చేయనున్నారు.
గ్రామీణ ప్రజలకు పూర్తి స్థాయి ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. పల్లె దవాఖానల పేరు తో గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉప కేంద్రాల్లోనే సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. బస్తీ దవాఖానాలు విజయవంతం కావడంతో ఇక పల్లె ప్రజలకు మె రుగైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేం ద్రాలు, పీహెచ్‌సీలు, హెల్త్ వెల్నెస్ సెంటర్ల(హెచ్ డ బ్ల్యూసీలు)ను అభివృద్ధి చేయాలని నిర్ణయించి, వాటిని పల్లె దవాఖానలుగా ఆప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ములు గు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలో సబ్ సెంటర్లను ఇకపై పల్లె దవాఖానలుగా పిలువనున్నారు. వీటిలో పనిచేసేందుకు ప్రత్యేకంగా మెడికల్ ఆఫీసర్(ఎంబీబీఎస్ డాక్టర్ల) నియామకానికి పచ్చ జెండా ఊపగా సెప్టెంబర్ 27న కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్య నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకునేందుకు వైద్యులకు అవకాశం కల్పించారు. త్వరలోనే 27 మెడికల్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ కానున్నాయి.
ఇక పల్లె దవాఖానలు
ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సబ్ సెంటర్లు పల్లె దవాఖానలుగా రూపాంతరం చెందనున్నాయి. గ్రామాల్లోని గడప గడపకూ ఉచిత వైద్యం అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా పల్లె దవాఖానలు పనిచేయనున్నాయి. ప్రసూతి వైద్య సేవలతో పాటు విష జ్వ రాలు, చిన్నారులకు చికిత్స, ఇతర అన్ని రకాల వైద్య సేవలు అందించనున్నారు. రోగులకు ఉచితంగా బీపీ, షుగర్, రక్త, మూత్ర పరీక్షలు చేసేందుకు ప్రత్యేకంగా డయాగ్నొస్టిక్ సెంటర్లను అనుసందానం చేయనున్నారు. సాధారణ జ్వరాలు, తల, ఒంటి నొప్పులు తదితర అవసరాలకు సరిపడా మందులు నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలో ఉండే అర్బన్, పీహెచ్సీలో అందుబాటులో ఉండే ఉచిత వైద్య సేవలన్నీ ఇక మీదట పల్లె దవాఖానలోనూ అందుబాటులోకి రా నున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాల ఆధారంగా మెరుగైన వైద్యం అవసరమైన వారికి సమీపంలోని ఏరి యా, జిల్లా వైద్యశాలలకు తీసుకెళ్లి వైద్య సేవలను అం దించనున్నారు. ప్రతి పల్లె దవాఖాన(పీహెచ్సీ)లో ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారు.
24 గంటలూ పల్లెల్లో వైద్య సేవలు
ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న ములుగు జిల్లాలో పల్లె దవాఖానల్లో పనిచేసేందుకు కాంట్రాక్టు పద్ధతిన నెలకు రూ.40వేల వేతనంతో 27 వైద్యాధికారుల పోస్టులు భర్తీ చేయనుండటంతో పల్లె దవాఖానల్లో 24గంటల వైద్యం అందే అవకాశం ఏర్పడింది. ఇందు లో భాగంగా కన్నాయిగూడెం పీహెచ్సీ పరిధిలో 2 సబ్ సెంటర్లు, మంగపేట పీహెచ్సీ పరిధిలో 7 సబ్ సెంటర్లలో 24/7 వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు జిల్లాలోని రాయినిగూడెం పీహెచ్సీ పరిధిలో అత్యధికంగా 12 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా, వాజేడు పీహెచ్సీ పరిధిలో 4, కొడిశాల పీహెచ్సీ పరిధిలో 2 సబ్ సెంటర్లతో కలిపి మొత్తం 27 సబ్ సెంటర్లను ములుగు జిల్లాలో పల్లె దవాఖానలుగా మా ర్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు.
సీఎం ఆదేశంతో శ్రీకారం..
బస్తీ దవాఖానలు విజయవంతం కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం కేసీఆర్ ఆదేశాలతో పల్లె దవాఖానలకు శ్రీకారం చుట్టారు. ములుగు జిల్లాలో మొదటి విడుత 27 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చేందుకు ప్రణాళికలను రూపొందించాం. వైద్యాధికారులను ప్రత్యేక పోస్టుల ద్వారా నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశాం. మందులు, ఇతర సామగ్రి సమకూర్చే పనిలో ఉన్నాం. ఆయా పీహెచ్‌సీల పరిధిలో ఉన్న వైద్య సిబ్బందితో పాటు అంగన్వాడీ, ఆశ వర్కర్ల ద్వారా పల్లె దవాఖానల్లో ప్రజలకు వైద్య సేవలు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.