
మెదక్ అర్బన్, నవంబర్ 30 : గంజాయి రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి కేసులను నమోదు చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీసులను ఆదేశించారు. పెండింగ్ కేసులపై మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీసులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. వర్టికల్ వారీగా పోలీసు అధికారులకు, సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. ఫోక్సో, మహిళలకు సంబంధించిన కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచాలని, ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్ట్గేషన్ జరుపాలన్నారు. పోలీసులు పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలన్నారు. రోజు వారి డాటాను విధిగా ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. కర్తవ్య నిర్వహణలో రోల్, గోల్ క్లారిటీ ఉండాలని చెప్పారు. డ్రగ్స్ అపెండర్స్ ప్రొఫైలింగ్ అనాలసిస్ మానిటరింగ్ సిస్టం యాప్ను డీజీపీ ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణపై గ్రామాలు, పట్టణాల్లో పోలీసు కళాబృందం, విలేజ్ పోలీసు అధికారులు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమీక్షా సమావేశంలో మెదక్ జిల్లా ఎస్పీ చందనదీప్తి, జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ బాలస్వామి, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, మెదక్ డీఎస్పీ సైదులు, తూప్రాన్ డీఎస్పీ పాల్గొన్నారు.