సుల్తాన్‌బజార్ : నేటి తరం యువత క్రీడల్లో పాల్గొని శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని సినీ నటుడు, మాజీ ఎంపీ ఆర్ శరత్‌కుమార్ అన్నారు.
సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలలో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి దివంగత ఎం ముఖేష్‌గౌడ్ మెమోరియల్ మిస్టర్ తెలంగాణ 2021 బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించారు. ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ బాడీ బిల్డింగ్ పోటీలకు ముఖ్య అతిధిగా సినీ నటుడు, మాజీ ఎంపీ శరత్‌కుమార్ హజరయ్యారు.
ఈ పోటీలలో మిస్టర్ తెలంగాణగా సి రాహుల్ నిలిచారు.ఈ సంధర్భంగా శరత్‌కుమార్ విజేతకు మిస్టర్ తెలంగాణ టైటిల్ ట్రోఫీతో పాటు 50 వేల నగదును అందించి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకే వేదికపై 200 మంది బాడీ బిల్డర్లతో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నేటి యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.
మాజీ మంత్రి దివంగత ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రంగౌడ్ మాట్లాడుతూ ఈ పోటీలు సీనియర్ మిస్టర్ ఇండియా 2021 కోసం, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాడీ బిల్డింగ్ పోటీలు, సెలక్షన్‌కు ట్రయల్స్‌గా ఉపయోగపడుతాయన్నారు. ఈ పోటీలలో టైటిల్ విజేతకు 50 వేల నగదు బహుమతిని అందించారు.
ఈవెంట్లో పాల్గొన్న బాడీబిల్డర్లకు మొత్తం నగదు బహుమతిగా 2 లక్షల రూపాయలను అందజేశారు.ఈ పోటీలలో ఎంపికైన బాడీ బిల్డర్లు 2022 జనవరి 6 నుండి 8వరకు ఖమ్మం జిల్లాలో జరుగనున్న సీనియర్ మిస్టర్ ఇండియా- 2022 ఈవెంట్లో పాల్గొంటారని అన్నారు.
ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా సంజీవ్‌యాదవ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ రాజు,కార్యదర్శి డి హరీష్‌సింగ్,సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.