
కొత్త పాసు పుస్తకాలు పొందిన 20,473 మందికి అవకాశం
ఈనెలాఖరు వరకు కొనసాగనున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియ
జిల్లాలో పాసు పుస్తకాలు కలిగిన మొత్తం రైతులు 1,51,657మంది
మూడేండ్లలో 1,591 మంది రైతు కుటుంబాలకు రూ.79.55కోట్ల బీమా సాయం
రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే దిశగా చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో అర్హులైన వారందరినీ ‘రైతుబీమా’ పథకంలో చేర్చేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తున్నది. కొత్తగా పాసుపుస్తకాలు పొందిన వారితోపాటు ఇంతకు ముందే పాసుపుస్తకాలు వచ్చినా రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని వారికి ఈ దఫా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన రైతులు 1,51,657 మంది ఉండగా, ఇందులో 2021 ఆగస్టు 3 వరకు భూములను రిజిస్టర్ చేసుకున్నవారు 20,473 మంది ఉన్నారు. ఈ ఏడాది రైతు బీమా కోసం పెద్దఎత్తున దరఖాస్తులు రాగా, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
జిల్లాలో మరికొంత మందికి రైతు బీమా
కొత్త పాసు పుస్తకాలు పొందిన 20,473 మంది రైతులకూ అవకాశం
మూడేళ్లలో 1,591 మంది రైతు కుటుంబాలకు రూ.79.55కోట్ల బీమా సాయం అందజేత
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారు. పంట పెట్టుబడికి ఇబ్బందులు లేకుండా ప్రతి సీజన్‌కు ముందే రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందజేస్తుండగా.. ప్రమాదవశాత్తు మృతి చెందిన రైతు కుటుంబానికి రైతు బీమా పథకం కింద రూ.5లక్షల బీమా సొమ్ము ను అందించి ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తున్నది. 18 నుంచి 59 ఏండ్లలోపు వయసు ఉన్న రైతులందరికీ రైతు బీమా వర్తిస్తుండగా..జిల్లాలో గడచిన మూడేళ్ల కాలంలో 1,591 కుటుంబాలకు రూ.79.55కోట్ల సా యం అందింది.
కొత్తగా పెద్ద ఎత్తున దరఖాస్తులు
రైతు బీమా పథకం కింద ఒక్కో రైతుకు ప్రభుత్వమే రూ.3,457 చొప్పున ఎల్ఐసీకి ప్రీమియం చెల్లిస్తున్నది. ఈ ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు ఈ పథకాన్ని వర్తింప జేసేందుకుగాను రూ.1,141 కోట్ల ప్రీమియాన్ని ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లించింది. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా ఉంటోంది. గ్రామాల వారీగా విస్తరణాధికారులు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. పాత రైతులకు యథావిధిగా ఈనెల 20 నుంచి 24 వరకు బీమా నవీకరణ చేసి కొత్త ఐడీ నంబర్లు ఇవ్వనున్నారు. కొత్తవారిని ఈనెల 30లోగా ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. పాత జాబితాలోని అనర్హులను, చనిపోయిన వారిని తొలగించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 2020-21లో 2,17,783 మంది రైతులకుగాను 1,13,002 మంది రైతులు అర్హులుగా గుర్తించి వారికి బీమా వర్తింపజేశారు. ఈసారి పాసు పుస్తకం కలిగిన రైతుల సంఖ్య 1,51,657 మందికి పెరగగా..రైతు బీమాకు లక్షా నలభైవేలకు పైగా రైతులు అర్హత పొందే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఏటా పెరుగుతున్న రైతుల సంఖ్య
రైతు బీమాకు దరఖాస్తు చేసుకుంటున్న రైతుల సంఖ్య ప్రతి యేటా పెరుగుతూ వస్తోంది. ఐదు గుంటల భూమి ఉన్నా.. రైతుగా పరిగణిస్తామని, పట్టా పాసు పుస్తకం పొందిన ప్రతి రైతుకూ బీమా అర్హత ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో చాలామంది ఎంతో కొంత భూమి కొనుగోలు చేశారు. కుటుంబంలో ఒకరిద్దరి పేరు మీద ఉన్న భూమిని మిగతా సభ్యులు తలా కొంత మార్చుకోవడంతో రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికితోడు రైతు బీమాకు ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించడంతో ప్రతి యేడు రైతు బీమాకు దరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
మూడేండ్లలో రూ.79.55కోట్ల సాయం
సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని 2018 ఆగస్టు 14 నుంచి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో 2018లో జిల్లాలో 559 మంది రైతులు మృతి చెందగా.. వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున బీమాను క్లెయిమ్ చేసింది. ఆయా కుటుంబాల నామిని ఖాతాలో రూ.27.95కోట్ల డబ్బులను జమచేసింది. 2019 సంవత్సరంలో 558 మంది రైతు కుటుంబాలకు రూ.27. 90కోట్ల సాయాన్ని, 2020 సంవత్సరంలో 474 మంది రైతులకు రూ.23.70కోట్ల సాయాన్ని అందించింది. మూడేళ్ల కాలంలో జిల్లాలో 1,591 మంది రైతు కుటుంబాలకు రూ.79.55కోట్ల బీమా సాయం అందింది.