
అంగన్వాడీలకు30 శాతంవేతనం పెంపు
స్వరాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు పెరగడం మూడోసారి
జిల్లాలో 1,745 మంది టీచర్లు, ఆయాలకు లబ్ధి
ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన రాష్ట్ర ప్రభుత్వం
ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు నెలనెలా అందుకునే వేతనం అరకొరగానే ఉండేది. ఈ నేపథ్యంలో స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు 30శాతం వేతనాన్ని పెంచి వారి కుటుంబాల్లో సంబురాన్ని నింపింది. స్వరాష్ట్రంలో వేతనాలు పెంచడం ఇది మూడోసారి కాగా..వేతనాన్ని పెంచి సీఎం కేసీఆర్ మరింత గౌరవాన్ని పెంచారని జిల్లాకు చెందిన అంగన్వాడీ ఉద్యోగులు ఖుషీ అవుతున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు టీచర్లకు రూ.4,200 వేతనం ఉండగా ప్రస్తుతం పెంచిన వేతనం రూ.13,650 అందుకోనున్నారు. అలాగే ఆయాలకు రూ.2,200 వేతనం ఉండగా.. తాజాగా రూ.7,800లకు పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెరిగిన వేతనాలతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కొత్త ఉత్సాహంతో విధులు నిర్వర్తించనున్నారు.
30 శాతం పెరిగిన అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు
స్వరాష్ట్రంలో అంగన్వాడీలకు వేతనాలు పెరగడం మూడోసారి
జిల్లాలో 1,745 మంది టీచర్లు, ఆయాలకు లబ్ధ్ది
ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన ప్రభుత్వం
యాదాద్రి భువనగిరి, ఆగస్టు20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల్లో వేతన సంబురం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం వేతనాన్ని పెంచి సముచిత గౌరవాన్ని కల్పించింది. స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆయా వర్గాలు వేతనాల కోసం ధర్నాలు, నిరసనలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుని ఉద్యోగుల పక్షపాతిగా నిలిచారు. వేతన పెంపుపై అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం..కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు గౌరవ వేతనం అందుకుంటున్న చిరుద్యోగులందరికీ వేతనాలు పెంచారు. ఫలితంగా జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులు, వీఆర్ఏ, వీఏఓ, సెర్ప్ ఉద్యోగులు, ఆశ వర్కర్లతోపాటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 30 శాతం మేర గౌరవ వేతనాలను ప్రభుత్వం పెంచింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో 1,745 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు లబ్ధి కలుగుతుంది. జూలై 1 నుంచే పెరిగిన వేతనం అమల్లోకి రానుంది.
ముచ్చటగా మూడోసారి..
స్వరాష్టంలో ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచడం ఇది మూడోసారి. ఉమ్మడి పాలనలో ఒక్కో అంగన్వాడీ టీచర్ వేతనం రూ.4,200 ఉండేది. ఆయాలు రూ.2,200 వేతనం అందుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది నెలలకే సీఎం కేసీఆర్ అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలను పెంచారు. ఆ లెక్కన టీచర్లకు రూ.7వేలు, ఆయాలకు రూ.4,500 పెరిగింది. ఆతర్వాత రెండోసారి వేతనాలను పెంచడంతో ప్రస్తుతం టీచర్లు రూ.10,500, ఆయాలు రూ.6వేల వేతనాన్ని పొందుతున్నారు. ఉద్యోగులకు ఇటీవల 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సందర్భంలోనే ఇతర ఉద్యోగులతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకూ వేతనాలను 30 శాతం పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా..ప్రభుత్వం వేతనాలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జూలై నెల నుంచే అంగన్వాడీ టీచర్లు రూ.13,650 వేతనాన్ని, ఆయాలు రూ.7,800 వేతనాన్ని అందుకోనున్నారు. తాజా..పెంపుతో టీచర్లకు 325 శాతం, మినీ అంగన్వాడి టీచర్లు, ఆయాలకు 354 శాతం పెరిగింది. ఏడేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం మూడు రెట్ల వేతనాన్ని పెంచగా..ఈ రీతిన దేశంలో ఎక్కడాలేదని ఆయా ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. .
జిల్లాలో 1,745 మందికి లబ్ధి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 844 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 57 వరకు మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. భువనగిరి ప్రాజెక్టు పరిధిలో 259 అంగన్వాడీలు, 8 మినీ అంగన్వాడీలు, ఆలేరు ప్రాజెక్టు పరిధిలో 208 అంగన్వాడీలు, 11 మినీ అంగన్వాడీ కేంద్రాలు, మోత్కూరు ప్రాజెక్టు పరిధిలో 126 అంగన్వాడీ కేంద్రాలు, 10 మినీ అంగన్వాడీ కేంద్రాలు, రామన్నపేట ప్రాజెక్టు పరిధిలో 251 అంగన్వాడీ కేంద్రాలు, 28 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్, ఆయా చొప్పున జిల్లా వ్యాప్తంగా 844 మంది టీచర్లు, 844 మంది ఆయాలు పనిచేస్తున్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో మరో 57 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపడుతుండడంతో కొత్తగా కొలువుదీరనున్న 10 మంది టీచర్లు, మరో 5 మంది మినీ అంగన్వాడీ టీచర్లు, 47 మంది ఆయాలు కలిపి వీరు 62 మంది ఉన్నారు. కొత్తవారికి కూడా పెరిగిన వేతనాలు వర్తించనుండడంతో జిల్లాలో 1,745 మంది అంగన్వాడీ ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది. గతంలో రెండోసారి వేతనాల పెంపు సందర్భంగా సీఎం కేసీఆర్ అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రగతి భవన్కు పిలిపించుకుని భోజనం చేయడంతోపాటు తీపి కబురు అందించారని జిల్లాకు చెందిన అంగన్వాడీ ఉద్యోగులు గత జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు తెలిసిన సీఎం కేసీఆర్ అంగన్వాడీల శ్రమను గుర్తించి వేతనాలను పెంచడం ద్వారా సముచిత స్థానం కల్పించారని కొనియాడుతున్నారు.
జీతాల పెంపు హర్షణీయం
గుండాల, ఆగస్టు 20: ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల జీతాల పెంపుపై తీసుకున్న నిర్ణయం హర్షణీయం. అంగన్వాడీ టీచర్లతో పాటుగా సహాయ సిబ్బంది వేతనాలు కూడా పెంచడం సంతోషకరం. టీచర్లకు రూ.10 వేల 5 వందల నుంచి రూ.13 వేల 650, సహాయ సిబ్బందికి రూ.6 వేల నుంచి రూ.7 వేల 8 వందలు, 30 శాతం పెరిగిన జీతాలు జూలై నెల నుంచి అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా 71 వేల 4 వందల మంది అంగన్వాడీ సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది.
కూరపాటి భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్,
1వ సెంటర్ అంబాల, గుండాల మండలం.
బొమ్మలరామారం, ఆగస్టు20:గత ప్రభుత్వాల హయంలో జీతాలు పెంచమని ఎన్ని సార్లు విన్నవించిన పట్టించుకోలేదు.కాని తక్కువ జీతాలతో పని చేస్తున్న మా బాధలు గుర్తించి సీఎం కేసీఆర్ 30శాతం జీతాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. మా శ్రమకు గుర్తింపు లభించింది. జీతాలు పెంచిన సీఎం సారుకు రుణపడి ఉంటాం. మరింత ఉత్సాహంతో పనిచేస్తాం.
మేడబోయిన కరుణమ్మ,
అంగన్ వాడీ టీచర్,బొమ్మలరామారం గ్రామం.
శ్రమకు గుర్తింపు లభించింది
ఉత్సాహంతో పనిచేస్తాం..
రామన్నపేట, ఆగస్ట్ 20: తక్కువ వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీల సేవలను గుర్తించిన మహానాయకుడు కేసీఆర్. తెలంగాణ ఏర్పడిన తరువాత అంగన్వాడీ కార్యకర్తలను టీచర్లుగా గుర్తించి గౌరవ వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచారు. ప్రస్తుతం రూ. 13,800 పెంచి అంగన్వాడీ కుటుంబాలకు భరోసా కల్పించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉత్సాహంతో పనిచేస్తాం. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
కోట ప్రవీణ, అంగన్వాడీ టీచర్, రామన్నపేట
బాధ్యత పెరిగింది..
అడ్డగూడూరు,ఆగస్టు 20: గతంలో అంగన్వాడీ టీచర్లను ఏ ప్రభుత్వం పట్టించుకోలే. వెట్టి చాకిరి చేయించుకున్నారే తప్ప మా బతుకుల గురించి పట్టించుకోలేదు. ఇప్పటివరకు చిన్న జీతాలతో ఎంతో ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ మూడు సార్లు వేతనాలను పెంచారు. అంగన్ వాడీ టీచర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించడం హర్షణీయం.మాసేవలను గుర్తించిన
నిరీక్షణ, అంగన్వాడీ టీచర్ , చౌళ్లరామారం, అడ్డగూడూరు మండలం
సేవలకు గుర్తింపుగా వేతన సవరణ..
మోత్కూరు,ఆగస్టు 20: ప్రభుత్వం అంగన్వాడీల పనిని గుర్తించి తగిన వేతనం అందించడం సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం. సీఎం కేసీఆర్ మా సేవలను గుర్తించి వేతన సవరణ అమలు చేయడంపై ఆనందం వ్యక్తమవుతుంది. అసలు పెరగదని భావించిన తమకు రూ.13,500లకు వేతనం పెంచడం సంతోషంగా ఉంది. అంగన్వాడీల సేవలను గుర్తించిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
చింతల నర్మద, అంగన్వాడీ టీచర్, దాచారం, మోత్కూరు మండలం.