
ఆలేరు టౌన్, ఆగస్టు 17 : మొహర్రం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ఒక్క గొప్ప మాసం. ఎనలేని గౌరవ ప్రతిష్టలు కలిగిన నెల. మొహర్రం నెలలో విషాదంగా గడుపుతారు. మరీ ముఖ్యంగా షియా ముస్లింలు ఈ నెలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈనెల 10న నెలవంక కనిపించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీన మొహర్రం పండుగ జరుపుకోనున్నారు.
ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ధర్మ పరిరక్షణ కోసం మహ్మద్‌ప్రవక్త మనువడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ప్రాణ త్యాగం చేసిన సంఘటనకు గుర్తుగా మొహర్రం జరుపుకుంటారు. ఇస్లాం సూత్రాల ప్రకారం ఏ రాజ్యంలోనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలి. ప్రభుత్వాన్ని లేదా రాజును ప్రజలే ఎన్నుకోవాలి. సరిగ్గా 1440 సంవత్సరాల కిందట ఇరాక్ ప్రాంతానికి దుష్టుడైన యజీద్ తనకు తానుగా రాజుగా ప్రకటించుకుంటాడు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. దీంతో ఆ ప్రాంతవాసులు మహ్మద్‌ప్రవక్త మనువడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్‌ను ఆశ్రయిస్తారు. తమను యజీద్ నుంచి కాపాడమని కోరుతారు. ప్రజల కష్టాలను విన్న హజ్రత్ హుస్సేన్ యజీద్పై పోరాటానికి సిద్ధమవుతాడు. అతనితో చర్చించేందుకు అరేబియా నుంచి ఇరాక్‌కు బయలుదేరుతారు. ఆయన వెంట అనుచరులు, కుటుంబ సభ్యులు 72 మంది తోడుగా వెళ్తారు. హజ్రత్ హుస్సేన్ రాకను తెలుసుకున్న యజీద్ తన సైన్యం చేత ఆయన్ను ఇరాక్ దేశంలోని కుఫా అనే ప్రాంతంలో బంధిస్తాడు. ఆ ప్రదేశాన్ని కర్బలా మైదానంగా పిలుస్తారు. హజ్రత్ హుస్సేన్‌తోపాటు మహిళలు, చిన్నారులకు సైతం సైన్యం చుక్క నీటిని ఇవ్వదు. యజీద్‌తో చర్చలకు అనుమతులు ఇవ్వరు. తనకు తోడుగా వచ్చిన వారి బాధలను చూడలేని హజ్రత్ హుస్సేన్ 10వ రోజున సైన్యంపై యుద్ధం ప్రకటిస్తారు. ఇందులో ఆయన వెంట వచ్చిన వారందరూ చనిపోతారు. చివరకు హజ్రత్ హుస్సేన్ పోరాడుతూనే మధ్యాహ్నం వేళ నమాజులో నిమగ్నమవుతారు. శత్రు సైనికులు హుస్సేన్ కంఠనాళాన్ని తెంపి, మొండెం నుంచి తలను వేరు చేసి కర్కశంగా చంపారు. మొహర్రం నెలలో 10వ రోజున జరిగిన ఈ సంఘటన గుర్తుగానే ముస్లింలు మొహర్రం నెల ప్రారంభమైన రోజు నుంచి పది రోజులను విషాద దినాలుగా జరుపుకుంటారు. 9, 10 రోజుల్లో ఉపవాస దీక్షలను నిర్వహిస్తారు. అషురా(10వ రోజు)న హజ్రత్ హుస్సేన్ బాధలను స్వయంగా అనుభవించేలా కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు తమ శరీరం నుంచి రక్తం కారేలా గాయాలు చేసుకుంటారు. దుఃఖంలో గడుపుతారు. జిల్లా కేంద్రంలో 10వ రోజున ఇమామ్ హుస్సేన్ త్యాగానికి సంతాపంగా నల్ల దుస్తులు ధరిస్తారు. ఇలా ధరించడం సంప్రదాయంగా భావిస్తారు. షియా యువకులు రక్తతర్పణను జ్ఞప్తి చేసుకుంటూ తమ శరీరంపై రక్తం కారేలా గాయాలు పెట్టుకుంటారు. ఇమామ్ పరివార త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు.
యాదాద్రి, ఆగస్టు 17 : యాదగిరిగుట్ట పట్టణంలో మొహర్రం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పీర్లను ఊరేగిస్తూ వీధుల్లో నృత్యాలు చేశారు. మంగళవారం పట్టణంలోని బీసీ కాలనీలో జరిగిన మొహర్రం వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్ పాల్గొన్నారు. పీర్లకొట్టం వద్ద ఏర్పాటు చేసిన అగ్ని గుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.అనంతరం పీర్లకు నైవేద్యం సమర్పించారు. మాజీ ఆలయ ధర్మకర్త పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, మాజీ వార్డు సభ్యుడు గడ్డం చంద్రంగౌడ్, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్ల భరత్, కోఆప్షన్ సభ్యుడు సయ్యద్‌బాబా, నాయకులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం), ఆగస్టు17: మొహర్రం సందర్భంగా మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో కులమతాలకు అతీతంగా భక్తులు డప్పుచప్పుళ్లతో పీర్లను ఊరేగించారు. పీర్లకు దట్టీలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
రామన్నపేట, ఆగస్ట్ 17: కులమతాలకు అతీతంగా మొహర్రాన్ని నిర్వహించుకోవాలని వెల్లంకి సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వెల్లంకిలో మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ పీర్ల ఊరేగింపులో పాల్గొని దట్టీలు, కానుకలను సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు.
రాజాపేట, ఆగస్టు 17 : ఆ ఊరిలో అతి పెద్ద పండుగగా జరుపుకునేది పీర్ల పండుగ. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండుగను హిందూముస్లింలు సోదరభావంతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రాజాపేట మండలంలోని పాముకుంటలో ఈ పండుగ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పండుగను చూడటానికి చుట్టు పక్కల గ్రామస్తులే కాకుండా బంధువులు పెద్దగా ఎత్తున వస్తుంటారు.
ఊరిలో ప్రతి ఏడాది మొహర్రం పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అన్ని పండుగల కంటే అతి పెద్దగా పీర్ల పండుగను జరుపుకుంటారు. పండుగకు కులమతాలకు అతీతంగా ఊరం తా ఏకమై సహకారం అందిస్తారు. గ్రామంలో పది రోజులపాటు పండుగ వాతావరణం నెలకొంటుంది. గ్రామంలో వైభవంగా నిర్వహించే పండుగను చూడటానికి ప్రజలు పెద్దఎత్తున తరలివస్తారు.