
జిల్లా నుంచి భారీ ర్యాలీలతో హుజూరాబాద్‌కు వెళ్లిన దళిత కుటుంబాలు సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన ‘తెలంగాణ దళిత బంధు’లో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి జిల్లా మీదుగానే బయలుదేరి వెళ్లిన ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలుసీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి నుంచి రెండు బస్సుల్లో వెళ్లిన 76 దళిత కుటుంబాలుచరిత్రాత్మక దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ వేదికగా సోమవారం సీఎం కేసీఆర్ ప్రారంభించిన నేపథ్యంలో జిల్లా నుంచి దళితులు పెద్దఎత్తున తరలివెళ్లారు. సీఎం కేసీఆర్ దళితబంధుకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామం జిల్లాలోని వాసాలమర్రిలోనే తొలుతగా దళితబంధును ప్రారంభించి నిధులను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వాసాలమర్రి గ్రామానికి చెందిన 76దళిత కుటుంబాలు రెండు బస్సుల్లో హుజూరాబాద్‌కు బయలుదేరి వెళ్లాయి. జిల్లా నలుమూలల నుంచి దళితులు పెద్ద ఎత్తున వెళ్లారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జిల్లా మీదుగానే వెళ్లి హుజూరాబాద్‌లో జరిగిన సీఎం కేసీఆర్ కార్యక్రమానికి హాజరయ్యారు.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చి, వారి జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రైతు బంధు తరహాలోనే..దళిత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 20వేల కోట్లతో ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న ఈ పథకాన్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అర్హులైన వారందరికీ దళిత బంధు పథకం ద్వారా నేరుగా సాయం అందించేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈ పథకంలో బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా ఒక్కొక్కరికీ రూ.10లక్షల నగదు సాయం అందనుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో జిల్లాలోని దళిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్‌లో సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ సభకు జిల్లా నుంచి భారీగా దళితులు తరలివెళ్లారు.
స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్నేళ్లలో దళితుల సంక్షేమాన్ని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఎన్నికల్లో దళితుల ఓట్లు పొందేందుకు తాత్కాలిక తాయిలాలతో సరిపెట్టారు తప్పితే ఆయా కుటుంబాల్లో సమూల మార్పు కోసం ప్రయత్నం చేసిన వారు లేరు. కానీ..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకముందే దళిత కుటుంబాలకు వరాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ అమలుచేయతలపెట్టిన ‘తెలంగాణ దళిత బంధు’తో దళిత జాతికి గొప్ప సాంత్వన చేకూరబోతుండగా..తొలి ఫలాలను జిల్లాలోని తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామం అయిన వాసాలమర్రి దళిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ అందించారు. రూ.10లక్షల చొప్పున మొత్తం 76 కుటుంబాలకు సాయం అందించేందుకు కలెక్టర్ ఖాతాలోకి నిధులను విడుదల చేశారు. అనుకోని వరం ఇచ్చి దళితులపై తనకున్న ప్రేమను చాటుకున్న సీఎం కేసీఆర్ ఆయా కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపగా..ఊహించని ఈ పరిణామం వాసాలమర్రి దళిత కుటుంబాలను ఉబ్బితబ్బిబ్బు చేస్తున్నది. ఈ క్రమంలోనే హుజూరాబాద్ కార్యక్రమానికి 76 దళిత కుటుంబాలు రెండు బస్సుల్లో బయలుదేరి సీఎం కేసీఆర్‌పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాయి.
తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ధ్ది పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ అమలు చేయ సంకల్పించిన ‘దళిత బంధు’ పథకంపై జిల్లాలోని దళిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో 1,36,108 మంది దళితులు ఉండగా..అర్హులైన వారందరికీ దళిత బంధు సాయం అందించే దిశగా ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపట్టనున్నది. సీఎం కేసీఆర్ సంకల్పాన్ని దళిత మేధావులు స్వాగతిస్తున్నాయి. దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం నాంది పలుకుతుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక సంక్షోభంలోనూ దళిత జాతి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కంకణం కట్టుకోవడం హర్షణీయమని దళిత కుటుంబాలు కొనియాడుతున్నాయి. ఈ క్రమంలోనే హుజూరాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు నిర్వహించిన సభకు జిల్లా నుంచి దళిత కుటుంబాలతోపాటు మేధావులు సైతం పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. నేతలు లాంఛనంగా ర్యాలీలను ప్రారంభించగా.. కోలాహలం నడుమ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో దళితులు హుజూరాబాద్‌కు బయలుదేరి వెళ్లాయి. వీరితో పాటు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితోపాటు పలువురు జిల్లా నాయకులు సీఎం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా జిల్లా మీదుగానే హుజూరాబాద్‌కు వెళ్లారు.