
లక్షలు.. కానీ, నేడు రూ.2కోట్లు ఇస్తామన్నా అమ్ముకునే వారు లేరు. విస్తీర్ణం, జనాభా పరంగా దామరచర్ల మండల కేంద్రం దశ మారుతున్నది. విద్యుత్ ప్లాంటుకు ముందు,ఆ తర్వాత.. అన్నట్లుగా రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయి. టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.30వేల కోట్లతో 4వేల మెగావాట్ల పవర్‌ప్లాంటు నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. యాదాద్రి పవర్‌ప్లాంటు సీఎం కేసీఆర్ ఉన్నత లక్ష్యం. ప్లాంటు పూర్తయితే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా మారి ఇతర రాష్ర్టాలకు సరఫరా చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాంతం లక్ష మంది జనాభాతో అభివృద్ధి చెందుతుందని,నల్లగొండ జిల్లాకే తలమానికంగా మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.
పవర్‌ప్లాంటు పనులు ప్రారంభం కావడంతో మండలంలోని భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మూడేండ్ల కిందట నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట ఎకరం భూమి రూ.30లక్షల నుంచి 40లక్షల వరకు ఉండగా పవర్‌ప్లాంటు రాకతో రెండున్నర కోట్లకు చేరుకుంది. దామరచర్ల నుంచి వీర్లపాలెం వరకు మూడేండ్ల కిందట రూ.20లక్షల వరకు ధర పలికిన భూములు నేడు కోటిన్నరకు చేరాయి. మండల కేంద్రంలోని రహదారి వెంట మడిగల విలువ రూ.20లక్షలకు చేరింది. బొత్తలపాలెం, కొండ్రపోల్, వాడపల్లి, రాళ్లవాగుతండా, రాజగట్టు, గ్రామాల్లో సైతం భూముల విలువలు అమాంతం పెరిగిపోయాయి. ఎకరం భూమి రూ.20లక్షలకు తక్కువ లేదు.
పవర్‌ప్లాంటు పనులను ప్రభుత్వం బీహెచ్ఈఎల్కు అప్పగించింది. తొలుతగా జెన్కో, బీహెచ్ఈఎల్ ఉద్యోగులు, సిబ్బంది. ఇంజినీర్లు పనులను చేపట్టారు. ప్రస్తుతం రెండు సంస్థల్లో సుమారు వెయ్యి మంది వరకు ఉద్యోగులు, సిబ్బంది, తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరితో పాటుగా ప్లాంటు నిర్మాణానికి సుమారు పది కంపెనీలు టెండర్ల ద్వారా పనులు దక్కించుకొని పనులు ప్రారంభించాయి. ప్రస్తుతం సుమారు 8వేల మంది కార్మికులు చెమటోడ్చుతున్నారు. వేలాదిగా ఈ ప్రాంతానికి తరలి రావడంతో అటు గ్రామాల్లో, సమీపంలోని మిర్యాలగూడ పట్టణంలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న రేకుల షెడ్లు సైతం నివాసాలుగా మారిపోయాయి. అద్దెకోసమే తాత్కాలిక భవనాలు నిర్మించి నెలకు రెండు నుంచి మూడు లక్షల ఆదాయంతో ఉపాధి పొందుతున్నారు.
‘ఎవ్వరూ అనుకోలేదు.. ఊహించనూ లేదు.. సీఎం తొలిసారిగా దామరచర్లకు ఆకస్మికంగా వచ్చేశారు. మంత్రులు, అధికారులతో కలిసి రెండు హెలికాఫ్టర్లలో దామరచర్లకు చేరుకుని మూడు ప్రదేశాలను పరిశీలించారు. గంట సేపు చర్చించిన తర్వాత దామరచర్లలో సమావేశం ఏర్పాటు చేశారు. తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామాల మధ్య మెగా అల్ట్రా థర్మల్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.’
కార్మికులు, ఉద్యోగులు అధికంగా రావడంతో వ్యాపారాలు కూడా పెరిగాయి. పవర్‌ప్లాంటు ముందు అనేక షాపులు వెలిశాయి. వీటితో పాటుగా దామరచర్లలోనూ వ్యాపారం పుంజుకుంది. పలు నూతన వ్యాపారాలను ప్రారంభించారు. గుజరాత్, జార్ఖండ్ తదిర రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు మండల కేంద్రంలో ఆటోమొబైల్ షాపులను ఏర్పాటు చేశారు. పవర్‌ప్లాంటు నిర్మాణంలో కూలీలకు అవసరమయ్యే పరికరాలను విక్రయిస్తున్నారు. రెస్టారెంట్లు, కిరాణాషాపులు, హోటళ్లు, పెట్రోల్ బంకులు పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దండిగా ఆర్జిస్తున్నారు.
ప్లాంటు నిర్మాణంతో మండలంలో ఇండ్ల నిర్మాణాలు పెరిగిపోయాయి. మూడేండ్ల కిందట దామరచర్లలో ఇంటి కిరాయి రూ.2వేల నుంచి 3వేల వరకు ఉండేది. నేడు రెట్టింపయ్యింది. తాళ్లవీరప్పగూడెంలో ఇండ్లు దొరకని పరిస్థితి. కిరాయి అధికంగా వస్తుండటంతో స్థలాలున్న వారు అప్పుచేసి, బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. దామరచర్లలో ఏడాదిన్నరలోనే 100 నూతన ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో బహళ అంతస్తులు అధికంగా ఉన్నాయి. లాక్డౌన్లో సైతం నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగడంతో మేస్త్రీలకు, కూలీలకు మంచి ఉపాధి లభించింది. తాళ్లవీరప్పగూడెం, బొత్తలపాలెం, రాళ్లవాగుతండా, రాజగట్లు పరిసర గ్రామాల్లోనూ నూతన ఇండ్ల నిర్మాణాలు చేపడ్తున్నారు. కాంట్రాక్టర్లు భూములను లీజుకు తీసుకొని తాత్కాలిక షెడ్లను నిర్మించారు.
దామరచర్ల నుంచి వీరప్పగూడెం వెళ్లే దారిలో నాకు పొలం ఉంది. యాదాద్రి పవర్‌ప్లాంటు నిర్మాణం కావడంతో మా భూములకు మంచి గిరాకీ వచ్చింది. వందలాది మంది కార్మికులు తరలి రావడంతో ఇండ్లు కట్టి వారికి అద్దెకు ఇవ్వాలని ఆలోచించా. పొలంలో 30రూంలతో ఇండ్లు నిర్మించి అందులో ఏసీ రూంలు కట్టించాం. ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు అద్దెకు ఉంటున్నరు. ఒక్కొక్క పోర్షన్‌కు నెలకు రూ.7వేల నుంచి 10వేల వరకు అద్దె వస్తున్నది.