
నూతన జోనల్ విధానంతో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం అయ్యింది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్గా పోస్టులను పునర్వ్యవస్థీకరించడంతో విద్యా, ఉద్యోగావకాశాల్లో అసమానతలు తొలగిపోయి అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు దక్కనున్నాయి. గతంలో ఆరో జోన్ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు ఉండగా..తాజాగా యాదాద్రి ఐదో జోన్ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు జనగామ జిల్లాలతో కొత్త జోనల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే..నల్లగొండ, సూర్యాపేటతోపాటు రాచకొండ పోలీస్ కమిషనరేట్లు యాదాద్రి జోన్లో చేరిపోయాయి. స్థానికతకే పట్టం కట్టడం..సొంత జిల్లాల్లోనే పనిచేసే వెసులుబాటు కలగడంతో తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జోన్లు ఉన్నాయనే భావన ఆయా వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. అస్తవ్యస్త విధానానికి తెరదించేలా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ విధానానికి శ్రీకారం చుట్టడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్త జోష్ కన్పిస్తున్నది. జోనల్ విధానంలోని అస్తవ్యస్త వ్యవస్థను తొలగిస్తూ సీఎం కేసీఆర్ నూతన జోన్ విధానానికి పచ్చజెండా ఊపడంతో యువతతోపాటు ఉద్యోగవర్గాల్లో భవిష్యత్తు దిశగా ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలోనే ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టనుండటంతో కొత్త కొలువుల జాతరకు సై అనేలా ప్రస్తుత జోనల్ వ్యవస్థ ఉంటుందనే ఆశ ఆశావహుల్ని ఊరిస్తోంది. గతంలో జోన్-6 పరిధిలో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇప్పుడు కొత్త స్వరూపాన్ని మార్చుకున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు కొత్తగా జనగామ జిల్లాతో కలిపి యాదాద్రి జోన్-5గా కొత్త రూపాన్ని పొందింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రక్రియ ఎట్టకేలకు పట్టాలెక్కింది. 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రత్యేకమైన కసరత్తును చేపట్టింది. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2018 ఆగస్టు 30న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్-2018 పేరిట కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఈ విధానం ప్రకారం తెలంగాణలో 7 జోన్లు, రెండు మల్టీజోన్లు ఏర్పాటయ్యాయి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం క్యాడర్ రీఆర్గనైజేషన్ను పూర్తి చేసి ఇటీవలనే జీవోలు జారీ చేసింది. జిల్లా, జోనల్, మల్టీజోనల్ క్యాడర్లుగా పోస్టులను పునర్వ్యవస్థీకరించింది.
కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆర్డర్ టు సర్వ్ విధానంలో ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. జోనల్ విధానం ఖరారుగాక బదిలీలు, పదోన్నతులు వంటి వాటిలో న్యాయం జరగడం లేదనే అసంతృప్తి వారిలో ఉన్నది. ఇక మీదట జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల వారీగా ఉద్యోగుల క్యాడర్ ఖరారు కావడంతో దీని ఆధారంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపుల ప్రక్రియ జరుగుతుంది. కొత్తగా నియమితులైన వారికి సైతం జోనల్ కేటాయింపులు ప్రయోజనం కలిగించనున్నాయి. ఉద్యోగులందరికీ సమాన అవకాశాలు కలిగి బదిలీలు, పదోన్నతుల విషయంలోనూ మేలు జరగనున్నది. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సొంత జిల్లాలకు వెళ్లే అవకాశాన్ని కొత్త జోనల్ వ్యవస్థ కల్పిస్తున్నది.
విద్య, ఉద్యోగాల సాధన విషయంలో కీలక ఉమ్మడి నల్లగొండ జిల్లా పాత జోన్-6 పరిధిలో తనదై ముద్రను వేసేది. మిగతా జిల్లాలకు దీటుగా ఇక్కడి యువత తమ ప్రావీణ్యాన్ని కొలువుల సాధనపరంగా చూపించే వారు. ఇప్పుడు పాత స్వరూపం మారిపోగా, కొత్తగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు జనగామ జిల్లా పరిధిలోని వారితో ఇక మీదట పోటీపడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడ ఆ జిల్లానే స్థానికతగా పరిగణించేవారు. ఇక నుంచి కొత్త విధానంలో భాగంగా ఏడో తరగతి వరకు వరుసగా నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు. మరోవైపు గతానికి భిన్నంగా స్థానికులకు 95శాతం ఉద్యోగవకాశాలు కల్పిస్తూ నూతన జోనల్ వ్యవస్థ అనుకూలంగా మారనున్నది. ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానం ప్రకారం.. 70 శాతం పోస్టులను స్థానికులకు కేటాయించగా, 30 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీ పరిధిలో ఉండేవి. దీనివల్ల స్థానిక అభ్యర్థులు నష్టపోతున్నారనే భావనతో 95 శాతం పోస్టులను స్థానికులే పొందేలా ఈ విధానం ఉపయుక్తంగా మారనున్నదని నిపుణులు చెబుతున్నారు.