వందశాతం మొక్కలు నాటాలి
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్
వనపర్తి, ఆగస్టు 18: పట్టణంలో పెండింగ్‌లో ఉన్న రోడ్డు వైండింగ్తోపాటు మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఏఈ భాస్కర్‌ను ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ కమిషనర్ చాంబర్లో బుధవారం ఆయన మున్సిపల్ అధికారులతో పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులు పూర్తిచేయడంలో అలస్వతం వహించకుండా వేగవంతంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మున్సిపల్ పరిధిలోని సెల్ఫ్ అసైన్‌మెంట్‌కు సంబంధించి టీం ద్వారా పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేయించాలని, అదేవిధంగా టీఎస్‌బీపాస్‌లో వివిధ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం పట్టణ శివారులో చేపట్టిన రెండు వరుసల హరితహారం మొక్కలను అదనపు కలెక్టర్ మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్తో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీకి ఇచ్చిన టార్గెట్‌ను 100శాతం పూర్తి చేయాలని, ఎక్కడైనా ఖాళీస్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని, శివారు ప్రాంతాల్లో మూడు వరుసల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నందిమల్ల భువనేశ్వరిశ్యామ్కుమార్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.