ఇంటింటికీ ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు
రీచార్జి చేసుకుంటేనే విద్యుత్ సరఫరా
కొత్త మీటర్లతో సులభంగా మానిటరింగ్
మొదటగా ఆఫీసులు, విద్యా సంస్థల్లో బిగింపు
దశల వారీగా విస్తరణకు ఏర్పాట్లు
ఇక స్మార్ట్ మీటర్లు రానున్నాయి. ఇంటింటికీ ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు బిగించేందుకు విద్యుత్ శాఖ సన్నద్ధమవుతున్నది. ప్రీపెయిడ్ అనే పదం మొబైల్ టాక్‌టైం, డేటాకు సంబంధించి వాడుతాం.. కానీ ఇప్పుడు కొత్తగా కరెంట్ రంగంలో వినిపించనున్నది. ఈ మీటర్లకు రీచార్జి చేస్తేనే విద్యుత్ సరఫరా కానున్నది. ప్రయోగాత్మకంగా ప్రభుత్వ కార్యాలయాలు,
విద్యాసంస్థల్లో బిగింపు చేపట్టి.. తర్వాత దశల వారీగా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 నాటికి వ్యవసాయ కనెక్షన్లు మినహా అన్ని రంగాల్లో ఈ మీటర్లు బిగించాలని కేంద్ర విద్యుత్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 15 శాతం నష్టాలున్న పట్టణాల్లో 2023లోగా
బిగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
వనపర్తి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ప్రీపెయిడ్.. పోస్ట్‌పెయిడ్.. ఈ పదాలు కేవ లం మొబైల్ టాక్‌టైం, డేటాకు సంబంధించి వింటుంటాం. కానీ, ఇటీవల ఇవి పలు రంగాలకు విస్తరించాయి. రవాణా రంగంలో ప్రీపెయిడ్ ఆటో, ట్యాక్సీ వంటి సేవలకు విస్తరించబడ్డాయి. ఇప్పుడు కొత్తగా విద్యుత్‌శాఖలో కూడా వినబడుతున్నది. సంస్కరణల్లో భాగంగా పారదర్శక విధానం కోసం కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లు, వినియోగంలో మార్పులు తీసుకొచ్చింది. ఇంటింటికీ త్వరలో స్మార్ట్ మీటర్ల విధానంలో ప్రీపెయిడ్ విద్యుత్ మీ టర్లు బిగించనున్నారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ప్రయోగాత్మకంగా అమ లు చేయనున్నారు. అనంతరం దశల వారీగా అన్ని శాఖలతోపాటు గృహాల్లో కూడా బిగించనున్నారు. 2025 నాటికి వ్యవసాయ కనెక్షన్లు మినహా అన్ని రంగాల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని కేంద్ర విద్యుత్‌శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. 15 శాతం నష్టాలున్న పట్టణాల్లో 2023లోగా బిగించాలని ఆదేశాలు జారీచేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
ఆపరేటింగ్ రిస్క్ తక్కువ..
ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుతో మెయింటనెన్స్ రి స్క్ తక్కువగా ఉంటుంది. వినియోగదారుల నుంచి వచ్చే బకాయిల భారం సంస్థకు తప్పనున్నది. రీచా ర్జి చేసుకుంటేనే విద్యుత్ సరఫరా చేసుకునే వీలుండడంతో బిల్లులు వసూలు చేసే ప్రక్రియ ఉండదు. సిబ్బందికి రిస్క్ లేదు. రీచార్జ్ విలువకు సరిపడా వి ద్యుత్ వినియోగం జరిగిన వెంటనే సరఫరా నిలిపివేయబడనున్నది. రీచార్జ్ రుసుం అయిపోతుందనే విషయాన్ని ముందుగానే మొబైల్‌కు సందేశం ద్వారా పంపనున్నారు. విద్యుత్‌శాఖ అధికారులు కనెక్షన్లు తొలిగించి ఇబ్బంది పెట్టే సమస్య నుంచి ఉపశమనం కలగనున్నది. అవసరం ఉన్నంత మాత్రమే వాడుకొని విద్యుత్ వినియోగంలో పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రారంభమైన ప్రక్రియ..
జిల్లాలో ఇప్పటికే ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు 297 మీటర్ల వరకు బిగించాం. సంస్థకు, వినియోగదారులకు బహుళ ప్రయోజనాలున్నాయి. విద్యుత్ దుబారా కాకుండా వినియోగదారులు జాగ్రత్త పడుతారు. బిల్లుల కోసం వినియోగదారుల వద్దకు వెళ్లే పరిస్థితి సిబ్బందికి తప్పుతుంది. ఎవరికి వారు వినియోగం అంచనా వేసుకుని రీచార్జ్ చేసుకుంటే నిరాటంకంగా విద్యుత్ పొందొచ్చు. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో మాత్రమే మీటర్లు బిగించాం. త్వరలో దశలవారీగా డొమెస్టిక్ వినియోగంలోకి తెస్తాం.