చార్మినార్ : కరోనా బారిన పడకుండా వైరస్ నుండి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ పొందాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. సోమవారం చార్మినార్ సమీపంలోని యునానీ ఆసుపత్రిలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోస్ ప్రక్రియను ఆయన స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ కరోనా ప్రక్రియలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపడుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న పరస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు కరోనా వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న ఒమొక్రాస్ వైరస్ నుండి రక్షణ పొందడానికి ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించిన వైద్యారోగ్య సిబ్బంది, మున్సి పల్, పోలీసు సిబ్బందితోపాటు సీనియర్ సిటిజన్లకు బూస్టర్ డోస్‌లను అందించడానికి ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు.
సోమవారం ప్రారంభమైన ఈ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల 60 వేల ప్రంట్‌లైన్ వారియర్స్‌లకు బూస్టర్ టీకాలను అందించనున్నామని తెలిపారు. యునానీ ఆసుపత్రితోపాటు స్థానికంగా కొనసాగుతున్న యూహెచ్పీల్లోనూ బూస్టర్ డోస్‌లను పొందవచ్చన్నారు. సీనియర్ సిటిజన్లతోపాటు 15 – నుండి 18 ఏళ్లలోపు చిన్నారులకు ఇప్పటికే 28 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంఐఎం శాసన సభ పక్ష నాయకులు అక్బరుద్దీన్ ఒవైసీతోపాటు చార్మినార్, మలక్‌పేట్, యాకుత్ఫుర, బహదూర్‌పుర నియోజకవర్గ ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్ ఖాన్, అహ్మద్ బలాల, సయ్యద్ అహ్మద్ పాషా కాద్రీ, మౌజంఖాన్లతోపాటు ఆసుపత్రి మౌలిక సదుపాయాల ఛైర్మన్ ఎరోళ్ల శ్రీనివాస్,ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పృద్దీ, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్, ఆసుపత్రి సూపరిండెంట్ కవిత తదితరులు పాల్గొన్నారు.