
మెదక్ రూరల్, జనవరి 5 : బాలకార్మిక వ్యవస్థను నియంత్రించేందుకు బడి బయట వెట్టి చాకిరిలో మగ్గుతున్న బాలబాలికలను గుర్తించి తిరిగి పాఠశాలలకు పంపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమమే ఆపరేషన్ స్మైల్-8. ఈనెల 3న జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రోహిణిప్రియదర్శిని వివిధ శాఖల అధికారులతో ఆపరేషన్ స్మైల్‌పై సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
పలు శాఖల సమన్వయం..
బాలకార్మిక వ్యవస్థను నియంత్రించడానికి పలు శాఖల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పోలీస్‌శాఖ, కార్మిక, మాతా, శిశు సంక్షేమ శాఖ, విద్యావైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ శాఖ, క్రీడాశాఖలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు విధులు నిర్వహిస్తున్నాయి. బాలకార్మికులను నిర్మూలించేందుకు 2015 నుంచి ప్రభుత్వం ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం కొనసాగుతున్నది. జూలైలో 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. బాలకార్మికులు, భిక్షాటన, వెట్టిచాకిరి చేస్తున్న వారిని గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం, అనాథలైతే బాలసదనంలోకి పంపించి, వారికి మెరుగైన విద్య అందిస్తున్నది. అందుకోసం జనవరి 1 నుంచి 31 వరకు జిల్లాలో ఆపరేషన్ స్మైల్ నిర్వహించేందుకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. అధికారుల బృందం సభ్యులతో కలిసి పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు, దుకాణాలు, హోటళ్లు, ఇటుక బట్టీలు, ఇండ్లలో పని చేసే చిన్నారులను గుర్తించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
చిన్నారులను పనిలో పెట్టుకుంటే చర్యలు..
14 ఏండ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే యాజమాన్యంపై చర్య లు తప్పవు. దుకాణాలు హో టళ్లు, ఇండ్లు, ఇటుక బట్టీలపై అధికారుల నిఘా ఉంటుంది. బాలకార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. అనాథలైతే బాలసదనంలో చేర్పిస్తాం. బాలలను రక్షించేందుకు పోలీస్, ఆరోగ్య, కార్మికశాఖ, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో బాలకార్మికులకు విముక్తి కల్పిస్తాం.
ఆపరేషన్ స్మైల్‌తో చిన్నారులకు రక్షణ..
బాలకార్మికుల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తున్నది. బాలల సంరక్షణకు బాలకార్మిక చట్టంతోపాటు వివిధ రకాల చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వెట్టిచాకిరి, భిక్షాటన చేస్తున్న పిల్లలకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి..
బాలలు ఎక్కడైనా పని చేస్తున్న ట్టు తెలిస్తే వెంటనే 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ రావడంతో మహి ళా, శిశు సంక్షేమశాఖలోని జిల్లా బా లల రక్షణ విభాగం, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పిల్లలను ఆధీనంలోకి తీసుకొని బాలల సంరక్షణ కమిటీ ముందు హాజరుపరుస్తాం. వారి ఆదేశాల మేరకు పిల్లలకు రక్షణ కల్పిస్తాం.
మెదక్ జిల్లాలో 2017 నుంచి2021 డిసెంబర్ వరకు..
2017 ఆపరేషన్ స్మైల్ 161
2017 ఆపరేషన్ ముస్కాన్ 135
2018 ఆపరేషన్ స్మైల్ 81
2018 ఆపరేషన్ ముస్కాన్ 118
2019 ఆపరేషన్ స్మైల్ 99
2019 ఆపరేషన్ ముస్కాన్ 94
2020 ఆపరేషన్ స్మైల్ 88
2020 ఆపరేషన్ ముస్కాన్ నిల్
2021 ఆపరేషన్ స్మైల్ 63
2021 ఆపరేషన్ ముస్కాన్ 88