మెహిదీపట్నం:దొంగతనం కేసులో విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చిన ఓ అనుమానితుడు భయంతో స్టేషన్ రెండో భవనం పై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న జాయింట్ కమీషనర్, పశ్చిమమండలం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ హుటాహుటిన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విచారణ చేపట్టారు.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…బీహార్‌కు చెందిన వాజిద్ ఆసిఫ్‌నగర్ రవీందర్‌నగర్‌లో గ్యాస్ గౌడన్ నిర్వహిస్తున్నాడు. అతడు జూలై 31న గౌడన్‌కు తాళం వేసి ఊరుకు వెళ్లాడు. ఆగస్టు 11న వాజిద్ ఊరు నుంచి తిరిగి వచ్చి చూడగా గౌడన్‌లో పెట్టిన సుమారు 6 లక్షల రూపాయల నగదు చోరికి గురైనట్లు గ్రహించి ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం వాజిద్ తన వద్ద పనిచేసే ఐదుగురిని అనుమానిస్తూ ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు.
పోలీస్ స్టేషన్ రెండోఅంతస్తులో ఉన్న క్రైం విభాగంలో ఖాలీద్, సల్మాన్లతోపాటు మరో ముగ్గురిని పోలీసులు విచారిస్తుండగా సల్మాన్ మద్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలకు గురైన సల్మాన్‌ను పోలీసులు వెంటనే చికిత్సకోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సల్మాన్ కుడికాలు, కుడిచేయి ఫ్రాక్చర్ అయ్యాయని, అతడికి ప్రాణాపాయం లేదని జాయింట్ కమీషనర్ , పశ్చిమమండలం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ అన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
పోలీసులకు పరేషాన్….
ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ నగరంలో శాంతిభద్రతల పరంగా అతిసున్నిత ప్రాంతంగా పేరు గాంచింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి సంచలన కేసులు నమోదు కావడం లేదు. దీంతో పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మెహిదీపట్నం భోజగుట్టకు చెందిన ఇద్దరు భార్యల పంచాయతీలో ఓ యువకుడు పోలీస్‌స్టేషన్‌లో చేయి కోసుకుని ఆత్మహత్యయత్నం చేయడం సంచలనం సృష్టించింది.
ఈ సంఘటన మరువకముందే ఆదివారం ఓ అనుమానితుడు పోలీస్ స్టేషన్ భవనం రెండో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ రెండు సంఘటనల్లో ఆయా వ్యక్తులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడం పోలీసులకు కొంత ఊరటనిస్తున్నా వారిని మాత్రం ఈ సంఘటనలు పరేషాన్ చేస్తున్నాయి.