నాటుగా కాకుండా రూటు మారుస్తున్నరు ఆయకట్టులో అధునాతన పద్ధతులునాటుకు బదులు సీడ్ డ్రిల్, డ్రమ్ సీడర్ వినియోగంపాత విధానంలోనూ వెదజల్లుతున్న రైతులుకూలీల కొరతకు పరిష్కారంతక్కువ పెట్టుబడి.. మంచి దిగుబడిప్రతి సీజన్‌కూ పెరుగుతున్న సాగు విస్తీర్ణం ఈసారి ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 65వేల ఎకరాలు
పెరిగిన పెట్టుబడి, తెగుళ్ల బెడద, కూలీల కొరతతో వరి సాగు అంటేనే కత్తిమీద సాములా తయారైంది. అయినా, వరి మినహా ఇతర పంటలకు అనుకూలంగా ఉండని నాగార్జునసాగర్ ఆయకట్టు భూముల రైతులు ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లుతున్నారు. నాట్లు వేయడం మాని.. పూర్వ పద్ధతిలో విత్తనాలు వెదజల్లుతున్నారు. యంత్ర సాయంతో పొడి దుక్కిలో సీడ్ డ్రిల్, డ్రమ్ సీడర్ వినియోగాన్ని పెంచారు. చీడపీడలు, పెట్టుబడి తగ్గుతుండడం, దిగుబడి బాగుండడంతో నాటుకు స్వస్తి పలుకుతున్న రైతుల సంఖ్య ప్రతి సీజన్‌కూ పెరుగుతున్నది. సూర్యాపేట జిల్లాలో యాసంగిలో 2 వేల ఎకరాల్లో వెదజల్లుడు, డ్రమ్ సీడర్ పద్ధతులు
అవలంబించగా, ఈ సీజన్లో ఇప్పటికే 15వేలకుపైగా ఎకరాల్లో
వెదజల్లుడు, 12 వేల ఎకరాల్లో డ్రమ్ సీడర్ వినియోగించారు.
నల్లగొండ జిల్లాలోనూ గత సీజన్‌తో చూస్తే ఇప్పటికే 20 శాతం ఈ పద్ధతుల్లో సాగు పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.
సూర్యా పేట, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ)/ మిర్యాలగూడ /మేళ్లచెర్వు : ప్రస్తుత పరిస్థితుల్లో వరిసాగుకు వ్యయం పెరగడంతోపాటు కూలీల కొరత ఏర్పడింది. తెగులు ఆశించడం, పెట్టుబడికి తగిన దిగుబడి రాకపోవడం వంటి కారణాలతో రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంబిస్తున్నారు. కొత్త విధానాల్లో వరిసాగు చేసి లాభాలు పొందుతున్నారు. డ్రమ్‌సీడర్, వెదజల్లడం, మెట్టవరి పద్ధతులు పాటిస్తున్నారు. గతేడాది కంటే ఈ విధానాల సాగు జిల్లాలో భారీగా పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు పుష్కలంగా ఇవ్వడంతోపాటు నిరంతర ఉచిత విద్యుత్, రైతు బంధు వంటి పథకాలు అమలు చేస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారింది. దాంతో ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కూలీల కొరత ఏర్పడడంతో రైతులు అధునాతన పద్ధతులు వినియోగిస్తున్నారు. సాధారణంగా వరి సాగు చేయాలంటే నాటు వేయడానికి 25 రోజుల ముందు నీటి కోసం ఎదురు చూస్తూ నారు పోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాటు వేసేందుకు ఎదురయ్యే కష్టం అంతా ఇంతా కాదు. అదే వెదజల్లుడు లేదా డ్రమ్ సీడర్ పద్ధతి అయితే నారు పోసే బాధ ఉండదు.. నీటి వినియోగం కూడా తగ్గుతుంది. కూలీల ఖర్చు తగ్గుతుంది.
వరి సాగులో నూతన పద్ధతులు అవలంబించే రైతులకు సమయంతో పాటు వ్యయం కూడా అదా అవుతుంది. అవకాశం ఉన్న నేలల్లో రైతులు పంట మార్పిడి చేయాలి. వెదజల్లుడు, డ్రమ్ సీడర్ పద్ధతులతో మంచి ఫలితాలు వస్తున్నాయి.
ఎస్సారెస్పీ జలాలు రావడంతో నాకున్న ఐదు ఎకరాల్లో రెండేళ్లుగా డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేస్తున్నా. ఎకరానికి 8కిలోల వడ్లతో డ్రమ్‌సీడర్‌తో విత్తుతున్నా. 30 క్వింటాళ్ల దిగుబడి పొందుతున్నా.
సూర్యాపేట జిల్లాలో గత వానకాలంలో 2 వేల ఎకరాల్లో వెదజల్లుడు, డ్రమ్ సీడర్ విధానం ద్వారా వరిసాగు చేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 15వేల ఎకరాల్లో వెదజల్లుడు, 12 వేల ఎకరాల్లో డ్రమ్‌సీడర్‌తో సాగు చేశారు. నల్లగొండ జిల్లాలో గత యాసంగిలో వెదజల్లే పద్ధతిలో 20వేల ఎకరాలు ఉండగా ఈ సారి 25 వేలు, డ్రమ్‌సీడర్ ద్వారా 15 వేల ఎకరాలు ఉండగా 20వేల ఎకరాలకు పెరిగింది. మరో 20వేల ఎకరాలు మిషన్‌తో నాటు వేశారు. సంప్ర దాయ పద్ధతులతో పోలిస్తే ఎకరాకు రూ.7వేల నుంచి రూ.10వేల ఆదా అవుతున్నది.
కాల్వలకు నీరు వదలగానే కూలీల కొరత వల్ల వరి నాట్లు చాలా ఆలస్యం అవుతున్నాయి. దీని వల్ల పంట దిగుబడి తక్కువ వస్తుంది. కూలీల ద్వారా నాటు వేయటం కంటే మెట్ట పద్ధతిలో వరి విత్తనాలు వేయడం వల్ల ఖర్చు తక్కువ అవుతున్నది. చీడపీడల బెడద లేదు. పురుగుమందుల ఖర్చు కూడా తగ్గింది. పంట దిగుబడి మంచిగా వచ్చింది.
నేను ఆరేళ్లుగా డ్రమ్‌సీడర్ విధానంలో సాగుచేస్తున్నా. దీనికి కూలీల అవస రం అంత ఉండ దు. చీడపీడల ఉధృతి లేదు. దిగుబడి కూడా బాగానే వస్తున్నది. నాతోటి రైతులతో చెప్పి ఈ పద్ధతిలో నాటు వేయించిన.