పోలీసులు కఠినంగా ఉంటారనేది చాలామందిలో సహజ భావన. స్టేషన్ ఆవరణలో అడుగు పెట్టాలంటేనే తెలియని ఆందోళన. ఆ గంభీరమైన వాతావరణాన్ని తుడిపేసి, నేడు పోలీస్ స్టేషన్లన్నీ హరిత నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారికి స్వాగతం పలుకుతున్నాయి. ఈ మార్పులో హరితహారం స్ఫూర్తి ఎంతో కీలకమైంది. గతంలో ఏదైనా సమస్యతో పోలీస్ స్టేషన్లకు వెళ్తే సమీపంలోని హోటళ్లు, ఛాయ్ దుకాణాలు అడ్డాలుగా మారేవి. కానీ, నేడు స్టేషన్ల ఆవరణలో పెరిగిన చెట్లు సందర్శకులకు చల్లని నీడనిస్తున్నాయి. పూలు, నీడనిచ్చే మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతో ఊరటనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా పోలీస్స్టేషన్లన్నీ పచ్చని ప్రహరీలతో కనువిందు చేస్తున్నాయి. పోలీస్ సిబ్బంది మొక్కల సంరక్షణపై మక్కువ పెంచుకుని ఎప్పటికప్పుడు నీరందిస్తుండడంతో ఏపుగా ఎదిగాయి.
పచ్చని నీడన..
శాలిగౌరారం పోలీస్స్టేషన్లో పెరిగిన చెట్లు చల్లని నీడనిస్తున్నాయి. హరితహారంలో భాగంగా పోలీస్ సిబ్బంది నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి పచ్చదనం పెరిగింది.
మేళ్లచెర్వులో..
మేళ్లచెర్వు మండల కేంద్రంలోని రక్షకభట నిలయం హరిత వనంలా కళకళలాడుతున్నది. పచ్చని చెట్ల నడుమ ఆహ్లాదకర వాతావరణం
ఏర్పడింది.
మోత్కూరు స్టేషన్ ..
మోత్కూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పచ్చదనం పరుచుకున్నది. ప్రహరీ వెంట నాటిన మొక్కలు నీడ నిస్తున్నాయి.
రాజాపేట ఠానా..
రాజాపేట పోలీస్ స్టేషన్లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగిన అల్లుకున్న పచ్చదనం.
కేతేపల్లి స్టేషన్ దారి..
కేతేపల్లి పోలీస్స్టేషన్ ఆవరణంతా చల్లని నీడనిస్తున్నది. మూసీ కుడి కాల్వ నుంచి స్టేషన్కు వెళ్లే దారికి ఇరువైపులా వేప, కానుగు, ఇతర నీడనిచ్చే మొక్కలు ఏపుగా పెరిగాయి. – కేతేపల్లి, అక్టోబర్ 9
తుర్కపల్లి పీఎస్
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ హరితవనాన్ని తలపిస్తున్నది.
పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.