
కొల్లాపూర్, జనవరి 21 : మండలంలోని సింగోటం బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుద్దీపాల అలంకరణలో శ్రీవారి సముద్రం మిరుమిట్లు గొల్పింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఓరుగంటి సంపత్‌కుమార్ శర్మ వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య తెలంగాణ టూరిజం శాఖకు చెందిన విశాలమైన జెట్టిలో లక్ష్మీనర్సింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని హంసవాహనంపై ఉంచి తెప్పోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి రామశర్మ పర్యవేక్షణలో ఈ ఘట్టం విజయవంతమైంది. ఆలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ రాజా ఎస్వీకేకేబీ ఆదిత్య లక్ష్మారావు, తనయుడు రాంగోపాల్రావుతో పాటు బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.