పటాన్చెరు, అక్టోబర్ 3 : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్, సర్కిల్ పార్టీ నూతన కార్యవర్గాన్ని సమావేశంలో ప్రకటించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నాయకత్వంలో టీఆర్ఎస్ పటిష్టంగా తయారైందన్నారు. వచ్చే రెండేండ్లు పరీక్షా సమయంగా పేర్కొన్నారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లు తుదిదశకు చేరుకున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో పటాన్చెరు నియోజకవర్గానికి ఎంపీ నిధులు అత్యధికంగా కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమమే సర్కారు లక్ష్యం
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకువెళ్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. పదవులు దక్కని కార్యకర్తలు, నాయకులు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు కార్పొరేషన్ పదవుల్లోనూ అవకాశం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, లలితాసోమిరెడ్డి, రోజాబాల్రెడ్డి, కార్పొరేటర్లు పుష్పానగేశ్, సింధూఆదర్శ్‌రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్‌కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర యువత నాయకులు వెంకటేశంగౌడ్, గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్‌రెడ్డి, సుప్రజావెంకట్‌రెడ్డి, కుమార్‌గౌడ్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదశ్, పరమేశ్, అఫ్జల్, నవీన్, గోవిండ్, శ్యాంసుందర్‌రెడ్డి, దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్ పార్టీల కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు దేశానికేకి ఆదర్శం
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని శాసన మండలి మాజీ చీఫ్ విప్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ఎండగట్టాలని కోరారు. ప్రధాని మోడీ సైతం తెలంగాణ పథకాలను ప్రశంసిస్తున్నారన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి కట్టే పన్నుల్లో కేవలం 50 శాతం మాత్రమే రాష్ర్టానికి కేటాయిస్తూ, మిగిలిన డబ్బులతో ఉత్తరాది రాష్ర్టాలను అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. ప్రతికార్యకర్త సోషల్ మీడియాలో చురుకుగా ఉండాలని కోరారు.