పరిశ్రమలను పరిశీలించిన ఐఆర్ఎస్ శిక్షణ బృందం
పాశమైలారం కేజేఎస్లో అవగాహన కార్యక్రమం
పటాన్చెరు, అక్టోబర్16: పాశమైలారం పారిశ్రామికవాడలోని కేజేఎస్ పరిశ్రమను నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెకు సంబంధించిన 62మంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీ బృందం పరిశీలించింది. శనివారం పటాన్చెరు మండలం పాశమైలారం ఐడీఏలోని కేజేఎస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ను 74వ బ్యాచ్ ఐఆర్ఎస్ బృందం మల్టీ డైమెన్షనల్ టూర్లో భాగంగా పరిశీలించేందుకు వచ్చారు. ప్రత్యేకంగా పరిశ్రమల ఉత్పత్తి విధానం, ఖర్చు, ఇన్‌కంట్యాక్స్ తదితర అంశాలను పరిశీలన చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్‌కంట్యాక్స్ అఫ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ గాయత్రి ఆధ్వర్యంలో 62మందితో కూడిన ట్రైనీ బృందం పరిశ్రమల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలో జరుగుతున్న ఉత్పత్తి, పరిశ్రమలో ఇతర అంశాలతో పాటు ఇన్‌కంట్యాక్స్ విధి విధానాల విధింపు విధానాలను గురించి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గాయత్రిదేవి మాట్లాడుతూ పరిశ్రమలకు, ఉత్పాదకరంగ సంస్థలకు పన్నుల విధింపులో పూర్తి అవగాహన రావాలనే ఉద్దేశంతో మల్టీ డైమెన్షనల్ టూర్ పెట్టామన్నారు. పరిశ్రమలో ఉత్పత్తికి తీసుకుంటున్న జాగ్రత్తలు, ఉత్పత్తి కోసం పడుతున్న శ్రమ, వాటి అమ్మకం, లాభనష్టాలను గుర్తించేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుందన్నారు. త్వరలోనే ఐఆర్ఎస్ అధికారులు శిక్షణ ముగించుకుని విధులో చేరుతారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల విధానం పరిచయం చేయడంతో పాటు సరైన పన్నుల విధింపునకు అవగాహన వస్తుందన్నారు. సునిశిత పరిశీలనతో దేశానికి ఉపయోగకరమైన పన్నుల విధానం అమలవుతుందన్నారు. ఫార్మా, ఇంజినీరింగ్, ఫుడ్ ఇండస్ట్రీలలో పన్నుల విధానంపై ఈ పర్యటన ట్రైనీ అధికారుల్లో స్పష్టత తీసుకు వస్తుందన్నారు. ఏ పరిశ్రమకు ఏ రకమైన ట్యాక్స్ విధించాలి. ఆ పరిశ్రమల ఆదాయంపైన పరిశీలనలు చేస్తామన్నారు. సివిల్ సర్వీసెస్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు ఐఆర్ఎస్ కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడిన జాబ్ అన్నారు. దేశం మొత్తంలో జరిగే ప్రతిష్టాత్మకమైన పరీక్షలను నెగ్గి ఈ అభ్యర్థులు నియామకాలు పొందుతున్నారన్నారు. దేశాభివృద్ధికి ట్యాక్స్ విధానం, పన్నుల విధింపు అత్యంత కీలకం అన్నారు. పన్ను ఎగవేతదారులను గుర్తించి సక్రమంగా చెల్లించేలా చూడాల్సిన బాధ్యత కూడా ఐఆర్ఎస్ అధికారులపై ఉంటుందన్నారు. ఈ శిక్షణ భవిష్యత్‌లో ట్రైనీ ఆఫీసర్స్‌కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కేజేఎస్ పరిశ్రమ ప్రతినిధి గిరీష్ జైన్ మాట్లాడుతూ వివిధ రకాల ప్రపంచస్థాయి తయారీ సంస్థల్లో కేజేఎస్ ప్రముఖంగా ఉందన్నారు. రాబోయే కాలంలో ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవీంగ్ కన్స్యూమర్ గూడ్స్)కు మార్కెట్లో ఉండే అవకాశాలను విడమరచి చెప్పారు. ఫుడ్ పరిశ్రమలు చాలెంజింగ్‌తో కూడికున్నవని, కేజేఎస్ సంస్థ వాటిని ఛేదించేందుకు శ్రమిస్తుందన్నారు. రాబోయే కాలంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వారికి ఉన్నతమైన స్థానాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అంజిరెడ్డి, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.
దేశసేవకు లభించిన మంచి అవకాశం..
దేశసేవకు ఐఆర్ఎస్ ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. నా విద్యాభ్యాసం కర్ణాటకలో జరిగింది. బీటెక్ చేశాక సివిల్ సర్వీసెస్‌పై ఆసక్తి పెంచుకున్నాను. పట్టుదలగా చదివి ఐఆర్ఎస్ సాధించాను. ఉద్యోగాన్ని చక్కగా నిర్వహించి మంచిపేరు సంపాదించాలని ఉంది. మాకు లభించిన శిక్షణ అత్యుత్తమంగా ఉంది. ఈ ఫీల్డ్ అనుభవం ట్యాక్స్‌ల విధింపు విధానంపై అవగాహనను కల్పిస్తుంది.
కష్టపడినందుకే ర్యాంకు వచ్చింది…
కష్టపడి చదివినందుకే నాకు ఇండియన్ రెవెన్యూ సర్వీసులో ర్యాంకు వచ్చింది. ఇంతవరకు నాలుగుమార్లు పరీక్షలు రాశాను. అప్పుడు సరైన ర్యాంకు రాలేదు. పట్టుదలగా చదివిన తరువాత ర్యాంక్ సాధించాను. ట్యాక్స్ విధానంలో ఉన్న విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ టూర్ ఉపయోగపడుతున్నది. పరిశ్రమలో ఉత్పత్తులను ప్రత్యక్షంగా పరిశీలించడంతో అవగాహన వచ్చింది. యువత కూడా ఐఆర్ఎస్లోకి రావొచ్చు. పట్టుదలతో, ప్రణాళిక ప్రకారం చదవాలి.
పరిశ్రమలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ట్రైనీ ఐఆర్ఎస్ అధికారులు వచ్చారు. వీరికి శిక్షణతో పాటు పరిశ్రమలను ప్రత్యక్షంగా చూపించాం. శిక్షణ అధికారులకు పరిశ్రమల సందర్శన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పరిశ్రమ టూర్ ద్వారా పరిశ్రమలు నడిచే విధానం, ఆర్థిక విభాగాలు, అడ్మిస్ర్టేషన్ అంశాలపై అవగాన కలుగుతుంది. టూర్లో భాగంగా ఫార్మా, టెక్స్టైల్ ఇండస్ట్రీలు చూశాం. కేజేఎస్ పరిశ్రమ ఉత్పత్తి విధానం, పనితీరు ఆకట్టుకున్నది. పరిశ్రమల టాక్స్ విధింపుపై పూర్తి అవగాహన అవసరం ఉన్నది. ఏ కేటగిరి పరిశ్రమకు ఎంత ట్యాక్స్ విధించాలో పరిశ్రమలను చూస్తే అవగాహన వస్తుంది.